తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కె టి రామారావుకు అరుదైన ఆహ్వానం లభించింది. వచ్చే ఏడాది మేలో అమెరికాలో జరుగనున్న వరల్డ్ ఎన్విరాన్మెంటల్ మరియు వాటర్ కాంగ్రెస్ సదస్సుకు హాజరుకావాలని కోరింది. అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ సంస్థ నిర్వహించే ఈ ప్రఖ్యాత సదస్సుకు కేటీఆర్‌కు రెండోసారి ఆహ్వానం లభించింది. 2017 సంవత్సరంలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాక్రమెంటోలో జరిగిన ఇదే సదస్సుకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై కీనోట్ ఉపన్యాసాన్ని ఇవ్వడం జరిగింది.
2017 సంవత్సరంలో కాలేశ్వరం ప్రాజెక్టు మరియు ఇతర తెలంగాణ ప్రభుత్వ ప్రాజెక్టుల గురించి వివరించి తెలంగాణ ప్రభుత్వ సాగునీటి మరియు పర్యావరణ సమతుల్యత, నీటి వనరుల అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలను కేటీఆర్ వివరించడం జరిగింది. అయితే ఈ సంవత్సరం నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రారంభమైన విషయాన్ని తాము తెలుసుకున్నామని కేటీఆర్‌కు పంపిన ఆహ్వానంలో నిర్వాహకులు తెలియజేశారు.
2020 మే 17 నుంచి 21 తేదీ వరకు అమెరికాలోని నేవెడా రాష్ట్రంలో జరగనున్న ఈ సదస్సుకి వివిధ దేశాల నుంచి సుమారు వెయ్యి మంది వాటర్ మరియు పర్యావరణ నిపుణులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఆయా దేశాల్లోని సాగునీటి వ్యవస్థలు, స్మార్ట్ వాటర్ కార్యక్రమాల గురించి ఈ సదస్సులో కూలంకషంగా చర్చిస్తారని కేటీఆర్ కు పంపిన ఆహ్వానం లో పేర్కొన్నారు. వరల్డ్ వాటర్ కాంగ్రెస్ సదస్సుకు ఈసారి కూడా keynote స్పీకర్గా హాజరై తెలంగాణ సాగునీటి అనుభవాలను వివరించాలని కేటీఆర్ కు పంపిన ఆహ్వానం కోరుతుంది.