మూడో ప్రపంచ యుద్ధం అత్యంత సమీపంలో ఉందని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు జ్యోతిష్కులు జోస్యం చెబుతున్నారు. మన దేశానికి చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు ప్రమోద్ గౌతమ్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. మరికొన్ని గంటల్లో ప్రపంచ వినాశనం మొదలుకానుందని ఆయన జోస్యం చెప్పారు. మే 13వ తేదీ నుంచి మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభంకానుందని ఆయన తేల్చి చెప్పారు. ఆయన చెప్పిన శకునం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ట్రంప్ గెలుస్తాడని ప్రమోద్ చెప్పిన జోష్యం నిజమైన నేపథ్యంలో తాజాగా ఆయన చెప్పిన శకునాన్ని ప్రపంచ మీడియా హైలైట్ చేసింది.
యుద్ధ నివారణ కోసం ప్రమోద్ తన శిష్యులతో కలిసి ఆగ్రాలోని యమునా తీరంలో శుక్రవారం మహా శాంతి యజ్ఞం చేశారు. యమున సోదరుడు, మృత్యువుకు అధిపతి(ది గాడ్ ఆఫ్ డెత్) అయిన యమధర్మరాజును ప్రసన్నం చేసుకోవడం ద్వారా యుద్ధాన్ని నివారించే ప్రయత్నం చేశామని ప్రమోద్ మీడియాకు చెప్పారు. ‘2017 మే 13 నుంచి సెప్టెంబర్ మాసాంతం వరకు డొనాల్డ్ ట్రంప్‌పై కుజుడు తీవ్ర ప్రభావం చూపుతాడు. ఈ సమయంలోనే అమెరికా తీవ్రహింసను ఎదుర్కొనబోతోంది. ప్రతిచర్యగా ట్రంప్ తీసుకునే నిర్ణయాలతో మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుంది’ అని ప్రమోద్ పేర్కొన్నారు.
మూడో ప్రపంచ యుద్ధం దగ్గర్లోనే ఉందని గుర్తుతెలియని హ్యాకర్ల బృందం ఓ వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసింది. ఏ క్షణాన్నైనా యుద్ధం ప్రారంభకావొచ్చని.. గతంలో జరిగిన ఒకటో ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం తరహాలో ఈ మూడో యుద్ధం కొన్ని సంవత్సరాలుగానీ, నెలల తరబడిగాని జరగదని కూడా పేర్కొంది. సత్వరం ముగిసే ఈ యుద్ధం గతంలోకంటే హోరాహోరీగా, క్రూరంగాను జరుగుతుందని హ్యాకర్ల బృందం అంచనా వేసింది.
మూడో ప్రపంచ యుద్ధం రావడానికి ఉత్తరకొరియా ద్వీపకల్పంలో చోటుచేసుకుంటున్న పరిణామాలే కారణమని కూడా అనానిమస్ హ్యాకర్లు చెబుతున్నారు. చైనా, జపనీస్ ప్రభుత్వాలు పౌర హెచ్చరికలు జారీ చేయడం కూడా ఇందుకు సూచననేనని అంటున్నారు. దక్షిణ కొరియాలో అమెరికా థాడ్ ఖండాంతర క్షిపణి రక్షణ వ్యవస్థను పరీక్షించడంతోపాటు మూడు ఖండాంతర క్షిపణులను కూడా అమెరికా పరీక్షించడాన్ని హ్యాకర్లు ప్రస్తావించారు.