తెలుగు నిత్యమై… నిఖిలమై

219
World Telugu Conference..History
- Advertisement -

తెలంగాణ నేల.. సాహితీ పరిమళాల పూలమాల. ఇక్కడ తెలుగు భాషా.. సాహిత్యాలు వికసిస్తాయి.. పద పరిమళాలు గుబాళిస్తాయి.  మన సంస్కృతి పురుడు పోసుకున్ననాడు అక్షర కుసుమాల దివిటీల నడుమ పల్లెల్లో సాహిత్యపు కాంతిపుంజాలు ప్రసరించిన చరిత్ర తెలుగు భాషది. తెలుగు భాష,సంస్కృతి,సంప్రదాయాలను ప్రపంచం నలుమూలల చాటిచెప్పేందుకు తెలుగ మహాసభలు వేదికగా నిలవనున్నాయి.

రాష్ట్ర విభజన తర్వాత జరుగుతున్న తెలుగు మహాసభలకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది. ఎల్బీ స్టేడియంలో డిసెంబర్ 15 నుంచి 19 వరకు  మహాసభలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. సభలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం కనివిని ఎరుగని రీతిలో ఏర్పాట్లుచేస్తోంది. పాల్కురికి సోమనాథుడి నుంచి నారాయణరెడ్డి దాకా పరుచుకున్న తెలుగు వెలుగు, సాంస్కృతిక పరిమళం  తెలుగు నేలను, భాషను సుసంపన్నం చేసిందని చెప్పేందుకు ఈ సభలను వేదికగా మలుచుకోనుంది కేసీఆర్ సర్కార్.

 World Telugu Conference..History
ప్రపంచ తెలుగు మహాసభలకు ఎంతో చరిత్ర ఉంది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమయంలో  1975 ఏప్రిల్‌ 12 నుంచి 18 వరకూ సాగిన ఆనాటి సభలు  తెలుగు వైభవానికి, సాంస్కృతిక ఘనతకు అద్దం పట్టాయి. రెండో మహాసభలు 1981లో ఏప్రిల్ 14 నుంచి 18 వరకు జరిగాయి.1990 డిసెంబర్ 10 నుంచి 13 వరకు మారిషస్‌లో మూడో మహాసభలు జరగగా చివరగా  తిరుపతిలో తెలుగు మహాసభలు జరిగాయి.

ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఆధ్యక్షతన జరిగిన నాటి సభలకు సూత్రధారి, కీలక పాత్రధారి నాటి విద్యాశాఖ మంత్రి మండలి వెంకట కృష్ణారావు. కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో అందరినీ సమన్వయం చేశారాయన. విశేషమేమంటే తొలి తెలుగు మహాసభల చిహ్నం- గ్లోబ్‌ మధ్యలో కాకతీయుల శిలాతోరణం. సభల వేదిక పేరు కాకతీయ నగరం (ఎల్‌బి స్టేడియం)..ఇప్పుడూ వేదికగా దీన్నే ఖరారు చేసింది తెలంగాణ ప్రభుత్వం. నాడు కూడా ఉపరాష్ట్రపతి బీడీ జెట్టి సభలను లాంఛనంగా ప్రారంభించారు, రాష్ట్రపతి ఫకృద్దీన్‌ అలీ అహ్మద్‌ ముగింపు వేడుకకు వచ్చారు. ఈ సారి కూడ ఉపరాష్ట్రపతి వెంకయ్య ప్రారంభించనుండగా రాష్ట్రపతి కోవింద్ ముగింపు సమావేశాలకు హాజరుకానున్నారు.

దాశరథి రాసిన ‘‘తల్లి పూజకు తరలి రండి’’ అన్న కవిత నాడు హైలెట్‌గా నిలిచింది. ప్రతీ సాహితీవేత్త, సాహిత్యాభిమాని పెదవులపై కదలాడింది. నాడు ఏపీ ఆస్థానకవిగా ఉన్న కవి సామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ, సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ డాక్టర్‌ బెజవాడ గోపాలరెడ్డి, సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ వావిలాల గోపాలకృష్ణయ్య సాహితీ చర్చాగోష్ఠుల రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో జరగనున్న తెలుగు మహాసభలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కేసీఆర్ సర్కార్‌. మహాసభల విజయవంతానికి కేబినెట్ సబ్‌ కమిటీని వేసింది. దేశ,విదేశాల నుంచి వచ్చే అతిథులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లుచేస్తోంది.

- Advertisement -