తెలంగాణలో తెలుగు భాషావికాసం, సాహితీమూర్తుల ప్రతిభా విశేషాలను ఘనంగా చాటే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమవుతున్నాయి. ఆరంభ వేడుకలు హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ క్రీడా మైదానంలో శుక్రవారం సాయంత్రం కనులపండువగా జరగనున్నాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ మహాసభలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. వేదికల అలంకరణ ఏర్పాట్లు గురువారం రాత్రి పూర్తయ్యాయి. ఆరువేల మందికి పైగా అతిథులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. వీరందరికీ స్వాగతం పలికి వసతి సౌకర్యాలను సమకూర్చారు. తెలంగాణకు ఖ్యాతి తేవడంతో పాటు తెలంగాణ భాషా పరిరక్షణ లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మహాసభలకు సంకల్పించారు. మంత్రివర్గ ఉపసంఘంతో పాటు నిర్వహణ ప్రధాన కమిటీ, 15 ఇతర కమిటీలను ఏర్పాటు చేశారు.
దాదాపు ఆరు నెలల కసరత్తుతో మహాసభలకు సకల సన్నాహాలు చేశారు. 11 కమిటీలతో కార్యక్రమాల కూర్పు జరిగింది. మహాసభలకు ఎల్బీ క్రీడామైదానంతో పాటు మరో ఆరు వేదికలను ఎంపిక చేశారు. వీటిలో తెలుగు భాషా సదస్సులు, చర్చాగోష్ఠులు, కథాసాహిత్యం, నవల, విమర్శ, గేయం, బాల, మహిళా సాహిత్యాలు, చరిత్ర, పరిశోధన, కవి సమ్మేళనాలు నిర్వహించనున్నారు. అష్టావధానం, హాస్యావధానం, జంట కవుల, నేత్ర, శతావధానాలు జరగనున్నాయి. పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో తెలుగు, న్యాయపరిపాలన రంగాల్లో మాతృభాష, ప్రవాస భారతీయ భాషా సాంస్కృతిక వికాసాలపైనా చర్చలుంటాయి. సదస్సుకు కవులు ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. 1500 మందికి పైగా హాజరవుతున్నారు. అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా, బ్రిటన్, సింగపూర్, మలేసియా తదితర దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, దిల్లీ ఇతర రాష్ట్రాల నుంచి 2000 మంది హాజరవుతున్నారు.
ప్రారంభం ఇలా…
శుక్రవారం ప్రారంభ వేడుకలను భారీఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. ఎల్బీ క్రీడామైదానాన్ని రూ.70 లక్షలతో అలంకరించారు. తెలంగాణ సంస్కృతిని చాటేలా వేదికను సిద్ధం చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి వేడుకలు ప్రారంభవుతాయి. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథి కాగా మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు, తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందినీ సిధారెడ్డిలు వేదికపై ఆశీనులు కానున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యఅతిథులు పాల్గొంటారు. కవులు, రచయితలు, దేశ, విదేశీ అతిథుల కోసం ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్ పర్యవేక్షణలో రాష్ట్రంపై రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నారు. అనంతరం ప్రారంభ వేడుకలు మొదలవుతాయి. ఈ సందర్భంగా పెద్దఎత్తున బాణాసంచా పేలుస్తారు. ప్రసంగాల అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే ప్రపంచ తెలుగు మహాసభలపై అంతటా ఉత్సాహం వెల్లువెత్తుతోంది. తెలంగాణ జిల్లాలతో పాటు దేశ విదేశాల నుంచి అతిథులు పెద్దఎత్తున నగరానికి వచ్చారు. జిల్లాల్లో నిర్వహించిన సన్నాహాక సమావేశాలు విజయవంతమయ్యాయి. సైకిల్‌యాత్రలు, నడకలు, పాదయాత్రలు జరిగాయి. కొందరు కాలినడకన తెలుగు మహాసభలకు వస్తున్నారు. మహాసభలను పురస్కరించుకొని హైదరాబాద్‌లో పెద్దఎత్తున అలంకరణలు చేపట్టారు. విద్యుద్దీపాల అలంకరణలతో పాటు 100 మంది తెలంగాణ సాహితీమూర్తుల స్వాగతద్వారాలు, తోరణాలను ఏర్పాటు చేశారు. కటౌట్లు, హోర్డింగ్‌లు అమర్చారు.
తెలుగు మహాసభల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపారు. కవులు, కళాకారులు, భాషావేత్తలు, కమిటీలతో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించారు. మహాసభలపై ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. మహాసభల నిర్వహణకు రూ.50 కోట్లు విడుదల చేశారు. దీంతోపాటు ఇంటర్మీడియట్ వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టారు. తెలంగాణ సాహిత్య చరిత్రను, భాషను తెలియజెప్పడంతో పాటు భావితరాలకు ఆదర్శమయ్యే రీతిలో సభలను స్ఫూర్తిదాయకంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో తెలుగు భాష అభ్యున్నతికి కీలకమైన పలు నిర్ణయాలను ప్రకటించనున్నారు. ప్రారంభం రోజున ఆయన ప్రభుత్వ ఉత్తర్వులను మాతృభాషలో వెలువరించేందుకు ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలిసింది. దీంతోపాటు విద్యాసాహిత్య, ఉద్యోగ, ఉపాధి పరంగా తెలుగుతో మేలయ్యే విధానాలను ప్రకటించే వీలుంది. మహాసభల సందర్భంగా వచ్చే సలహాలు, సూచనల ఆధారంగా చివరి రోజు మరికొన్ని నిర్ణయాలు ప్రకటించనున్నారు.