‘బీరు వద్దు… నీరు కావాలి’..!

251
- Advertisement -

కర్ణాటకలో గ్రామీణ ప్రాంతాల నుంచి మహిళాలోకం కదంతోక్కుతూ కదిలింది. ఓ వైపు ప్రజల్లో చైతన్యాన్ని నింపుతూ, మరో వైపు ‘బీరు వద్దు… నీరు కావాలి’ అనే నినాదంతో ప్రభుత్వానికి తమ డిమాండ్లను సమర్పించడానికి మహిళలందరూ నడుము బిగించారు. ఇదంతా జరిగింది కర్ణాటకలో. ఈ నెల 19న చిత్రదుర్గ ప్రాంతం నుంచి ఈ మార్చ్‌ ప్రారంభమైంది.

దాదాపు 2,500 మంది మహిళలు ఈ యాత్రలో పాల్గొన్నారు. రోజుకి 20 కిలోమీటర్ల చొప్పున నడుస్తూ, మార్గంమధ్యలో 23 జిల్లాల్లోని గ్రామీణ మహిళలకు మంచినీటి అవసరంపై అవగాహన కలిగిస్తూ ముందుకు సాగుతున్నారు. తమ పాదయాత్రలో మద్యం దుష్పరిణామాలు, మద్యనిషేధం అవసరంపై ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నట్టు ఉద్యమ కార్యకర్త ఒకరు తెలిపారు. దారిపొడవునా బహిరంగ సభలు నిర్వహిస్తున్నామన్నారు.

womens rally

క్యాడిగెరె, హోసూరు, నిత్యానంద ఆశ్రమ, జగగొండన హల్లి, తావర కెరె, సిర, చిక్కనహల్లి, సీబీ టెంపుల్, తుంకూరు, సిద్ధ గంగ మఠ్, ఆది శంకరాచార్య మఠ్, కులవనహల్లి, టి.బెగుర్, డాసనపుర, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, యశ్వంతపూర్ ప్రాంతాల్లో సభలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నట్టు చెప్పారు.

కర్ణాటకలో మధ్యనిషేధం డిమాండ్‌పై 2016లో ఎంఎన్ఏ ఏర్పాటయింది. 30కి పైగా సంస్థలు ఎంఎన్ఏ డిమాండ్‌కు మద్దతు తెలుపుతున్నారు. వీరంతా ఈనెల 30న బెంగళూరులోని విధానసభకు చేరుకుంటారు. అక్కడే ప్రభుత్వానికి తమ సమస్యల్ని నివేదించనున్నారు.

- Advertisement -