బెంగుళూరు న్యూ ఇయర్ వేడుకలో కీచకపర్వం..

109
Bengaluru

న్యూ ఇయర్‌ కు ఘనంగా వెల్‌కమ్ చెప్పేందుకు అందరు రోడ్లపైకి చేరుకున్నారు. యువతి, యువకులంతా కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయారు. కొన్ని నిముషాల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే టైం. కానీ అంతలోనే ఒక్కసారిగా అలజడి మొదలైంది. కొంతమంది ఆకతాయిలు అమ్మాయిలపై ఆకృత్యాలకు పాల్పడ్డారు. అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటన ఐటీ సిటీగా పేరొందిన బెంగళూరులో చోటు చేసుకుంది. పార్టీ హబ్‌గా పేరొందిన ఎంజీ రోడ్, బ్రిగేడ్‌ రోడ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో వేలాది మంది మధ్యలో యువతులు, మహిళలపై కామాంధులు అసభ్య ప్రవర్తనకు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. కొందరైతే మహిళలపై భౌతికదాడులకూ దిగినట్లు తెలుస్తోంది. రాత్రి 11:45 గంటల నుంచి అర్ధరాత్రి 12:05 గంటల మధ్య యువతులపై అకృత్యాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.

Bengaluru

మహిళల గురించి అసభ్యంగా మాట్లాడుతూ, ఎక్కడపడితే అక్కడ తాకుతూ వికృతా నందాన్ని పొందారు. మరో ఘటనలో 25 మంది యువకులు ఇద్దరు అమ్మాయిల చుట్టూ తిరుగుతూ వేధిస్తుండగా ఓ మహిళా ఎస్సై వచ్చి వారిని రక్షించారు. ఈ ఘటనలన్నిటికీ విపరీతంగా డ్రగ్స్‌ తీసుకున్న యువకులే కారణమని తెలుస్తోంది. 1,500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించినా వేధింపులను అడ్డుకోలేకపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సమాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

Bengaluru

వెంటాడి.. దుస్తులను చించి వేధించారు
అక్కడే ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్‌ మాట్లాడుతూ…‘సరిగ్గా అర్ధరాత్రి 12:02 గంటలకు ఇద్దరు యువతులు తమను రక్షించాల్సిందిగా నా వైపునకు పరిగెత్తుకు వచ్చారు. వారి సింగల్‌పీస్‌ గౌన్లు చిరిగిపోయి ఉన్నాయి. వారి వెనుక నలుగురు యువకులు కూడా వెంబడిస్తూ వచ్చారు. ఆ అమ్మాయిల జోలికి రావద్దని వారికి వారించా. అయితే నాపై కూడా దాడికి యత్నించారు. ఇంతలో అక్కడే ఉన్న సాయుధ పోలీసు పరిగెత్తుకు రావడం చూసి కొంత స్పృహలో ఉన్నవారు మిగిలిన ఇద్దరిని ఈడ్చుకుంటూ దగ్గర్లోని గుంపులో కలసిపోయారు. వారు విపరీతంగా డ్రగ్స్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది’ అని వివరించారు.

Bengaluru

రాష్ట్ర హోం మంత్రి డాక్టర్‌ జి.పరమేశ్వర్‌ స్పందిస్తూ ‘వీడియో ఫుటేజ్‌లలో నమోదైన అంశాలను పరిగణలోకి తీసుకుని, ఆకతాయిలను గుర్తించే ప్రక్రియ మొదలైంది. ఇటువంటి విపరీతాలకు పాశ్చాత్య సంస్కృతే కారణం. మహిళలపై లైంగిక దౌర్జన్యాలు జరగకుండా పోలీసులను నియమించాము. పరిస్థితి అదుపు తప్పింది. దురదృష్టకర ఘటనలను పునరావృతం కాకుండా జాగ్రత్తల్ని తీసుకుంటాం’అని తెలిపారు. ఇప్పటికే కొందరు ఆకతాయిలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దౌర్జన్యానికి, లైంగిక సతాయింపులకు గురైన మహిళల నుంచి ఇప్పటి వరకు ఒక్క ఫిర్యాదూ రాలేదని నగర పోలీసు కమిషనర్‌ ప్రవీణ్‌ సూద్‌ తెలిపారు.

Bengaluru