సొంతగడ్డపై ఆరెంజ్ ఆర్మీ ఇరగదీసింది. ఉప్పల్ వేదికగా ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదుచేసింది. ఆల్ రౌండ్ నైపుణ్యంతో ఢిల్లీని మట్టికరిపించిన వార్నర్ సేన పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలోకి దూసుకెళ్లింది.192పరుగల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్.. సిరాజ్ తొలి ఓవర్లోనే ఓపెనర్ బిల్లింగ్స్ (13; 9 బంతుల్లో 3×4) వెనుదిరిగాడు. ఐతే సంజు, కరుణ్ నాయర్ (33; 23 బంతుల్లో 5×4, 1×6) బాధ్యతాయుతంగా ఆడారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూనే రన్‌రేట్ తగ్గకుండా పరుగులు రాబట్టారు. సంజు, కరుణ్ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్లు బాదారు.
ఈ సీజన్‌లో తొలిసారిగా బౌలింగ్ చేసిన యువరాజ్ ఒక్కసారిగా మ్యాచ్‌లో మార్పు తెచ్చాడు. యువీ వేసిన ఇన్నింగ్స్ పదో ఓవర్ రెండో బంతికే కరుణ్ రనౌటవగా.. ఆరో బంతికి రిషబ్ పంత్ (0) డకౌటయ్యాడు. ఒక్క ఓవర్లో 2 వికెట్లు పడటంతో ఢిల్లీ జోరు తగ్గింది. సంజును సిరాజ్ ఔట్ చేయడంతో ఢిల్లీపై ఒత్తిడి పెరిగింది.చివర్లో శ్రేయస్, మాథ్యూస్ (31; 23 బంతుల్లో 2×4, 1×6) పోరాడినా ఫలితం లేకపోయింది. 12 బంతుల్లో 34 పరుగులు చేయాల్సి ఉండగా.. భువనేశ్వర్ 10 పరుగులిచ్చాడు. దీంతో సమీకరణం 6 బంతుల్లో 24 పరుగులకు మారింది. సిద్ధార్థ్ కౌల్ చివరి ఓవర్లో మాథ్యూస్ వికెట్ తీసి.. 8 పరుగులే ఇవ్వడంతో సన్‌రైజర్స్ సంబరాల్లో ముగినిపోయింది. 20 ఓవర్లలో 5 వికెట్లకు 176 పరుగులు చేసి 15 పరుగుల తేడాతో ఓడిపోయింది.
అంతకముందు టాస్ గెలిచిన హైదరాబాద్ బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్వితీయ ప్రదర్శనతో సత్తాచాటింది. సన్‌రైజర్స్ రెండో ఓవర్లోనే వార్నర్ (4) వికెట్ చేజార్చుకుంది. ఐతే మహ్మద్ నబి స్థానంలో కేన్ విలియమ్స్‌న్ తుదిజట్టులోకి తీసుకోవడం సన్‌రైజర్స్‌కు కలిసొచ్చింది. అతడు వచ్చీరాగానే పరుగుల వేట మొదలుపెట్టాడు కేన్. ఏంజెలో మాథ్యూస్ వేసిన 7వ ఓవర్లో 2 భారీ సిక్సర్లతో జట్టును స్కోరును 50 పరుగులు దాటించాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కేన్ విలియమ్సన్ (89; 51 బంతుల్లో 6×4, 5×6), శిఖర్ ధావన్ (70; 50 బంతుల్లో 7×4, 1×6) చెలరేగడంతో తొలుత సన్‌రైజర్స్ 4 వికెట్లకు 191 పరుగుల భారీస్కోరు సాధించింది.