ఇండిగోపై కఠిన చర్యలు తప్పవు!

4
- Advertisement -

భారీగా విమానాల రద్దు, ఆలస్యాలపై ఇండిగో విమాన సంస్థపై విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో, దాని ఫలితాల ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్ మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఇండిగో విమానాల ఆలస్యం, రద్దుల వల్ల ఏర్పడిన పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని, రేపటినుంచే విమానాశ్రయాల్లో వేచి ఉండే పరిస్థితులు తగ్గుతాయని తెలిపారు. ఈ అంతరాయానికి గల కారణాలు, తలెత్తిన లోపాలు ఏవి అనే విషయాలను తెలుసుకునేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు.

ప్రభుత్వానికి ప్రస్తుతం అత్యవసర ప్రాధాన్యం సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడం, ప్రయాణికులకు పూర్తిగా సహాయం చేయడమేనని అన్నారు.నేడు పరిస్థితి మెరుగుపడుతోంది. గత రెండు రోజులుగా ఉన్న బ్యాక్‌లాగ్ క్లియర్ అయింది. రేపటినుంచి విమానాశ్రయాల్లో రద్దీ, వేచి ఉండడాలు ఉండకపోవచ్చని భావిస్తున్నాం. ఇండిగో వెంటనే ఎలాంటి ఆపరేషన్లు ప్రారంభించగలదో అవన్నీ ప్రారంభిస్తుంది అని మంత్రి తెలిపారు.

అలాగే, “మేము దీనిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. FDTL నిబంధనలు, షెడ్యూళ్లు, నెట్‌వర్క్ వ్యవహారాలు అన్నీ పూర్తిగా పరిశీలిస్తాం. అన్ని విమాన సంస్థలు నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూస్తాం,” అన్నారు. గత 5 రోజులుగా జరిగిన భారీ సంఖ్యలో విమానాల రద్దులపై మాట్లాడుతూ మంత్రి, “ఎక్కడ లోపం జరిగింది, ఎవరి వల్ల జరిగింది అన్నది ఖరారు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేశాం. దానిపై ఆధారపడి అవసరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటాం. ఇది వదిలేసే అంశం కాదు. తప్పు చేసిన వారు జవాబుదారులు కావాల్సిందే,” అని పేర్కొన్నారు.

ఇండిగో, దేశంలో అతిపెద్ద విమాన సంస్థగా ఉన్నప్పటికీ, వరుసగా నాలుగో రోజుకూ ఆపరేషన్లలో అంతరాయాలు కొనసాగాయి. శుక్రవారం రోజు ఒక్కరోజే 1,000 కంటే ఎక్కువ విమానాలు రద్దయ్యాయి. అంతకుముందు రోజు 550కు పైగా రద్దయ్యాయి. శనివారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయం పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోందని ప్రకటించినప్పటికీ, ఇతర విమానాశ్రయాల్లో రద్దులు కొనసాగాయి. కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో మూడు దేశీయ అరైవల్స్, మూడు డిపార్చర్స్ రద్దయ్యాయి. అహ్మదాబాద్ విమానాశ్రయంలో అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 7 అరైవల్స్, 12 డిపార్చర్స్ రద్దయ్యాయి.

Also Read:BB9:కళ్యాణ్‌పై నోరుజారిన భరణి!

- Advertisement -