సాయికృష్ణకు అండగా ఉంటాం:కేటీఆర్

252
రొఇ

అమెరికాలో దుండగుల కాల్పుల గాయపడి చికిత్స పొందుతున్న సాయికృష్ణకు అండగా ఉంటామని స్పష్టం చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహబూబాబాద్ జిల్లాకు చెందిన సాయికృష్ణ తల్లిదండ్రులు ఇవాళ కేటీఆర్‌ని కలిసి ఆదుకోవాలని,మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కేటీఆర్ ప్రభుత్వ పరంగా అన్నిచర్యలు తీసుకుంటామని చెప్పారు.

సాయికృష్ణకు వైద్య సాయం అందించాలని సుష్మాస్వరాజ్‌ను ఎంపీ సీతారాం నాయక్‌ కోరారు. దీనిపై స్పందించిన సుష్మ.. అమెరికాలోని భారత రాయబార అధికారులతో మాట్లాడారు.

సాయికృష్ణ పూస డెట్రాయిట్ డౌన్‌టౌన్‌లో ఓ ఆటోమోటివ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల మూడోతేదీన విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఓ మెక్సికన్ ఫుడ్ రెస్టారెంట్ దగ్గర కారును ఆపినప్పుడు సాయుధ దుండగులు చొరబడ్డారు. తుపాకులు చూపి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి డబ్బులు,బట్టలు లాగేశారు. వెళ్ళిపోయేముందు సాయికృష్ణ నోటిలో తుపాకి పెట్టి కాల్చేశారు. సాయికృష్ణ పరిస్థితి విషమంగా ఉందని, సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు నిర్వహించాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. సాయికృష్ణ తండ్రి ఎల్లయ్య కురవి మండలం లింగ్యాతండా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.