సబ్ కా సాథ్..సబ్ కా వికాస్ ..సబ్ కా విశ్‌వాస్ నినాదంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలిపారు. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన కోవింద్ లోక్ సభలో కొత్తగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
భారత్‌లాంటి పెద్ద దేశంలో శాంతియుతంగా ఎన్నికలు జరగడం అభినందనీయమన్నారు. 61 కోట్ల మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకుని రికార్డు సృష్టించారని చెప్పారు కోవింద్. ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొందని చెప్పారు. 17వ లోక్‌సభలో చాలా మంది ఎంపీలు కొత్తవారే. అంతేగాక, మహిళా సభ్యుల సంఖ్య కూడా పెరిగిందన్నారు.
2022 నాటికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుందని…నవ భారత నిర్మాణం కోసం ప్రభుత్వం నిబద్దతతో పనిచేస్తుందన్నారు. బహిరంగ, అంతర్గత ముప్పుల నుంచి దేశానికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.
రైతుల, జవాన్ల కుటుంబాలకు అండగా నిలుస్తామని చెప్పిన రాష్ట్రపతి.నీటి సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందన్నారు. ప్రజలందరి జీవన స్థితిగతులు మారుస్తామని చెప్పిన కోవింద్…. గ్రామీణ ప్రాంతాలకు పూర్థిస్థాయి సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. యువతకు మంచి విద్యావకాశాల కల్పనకు మరిన్ని కోర్సులు తీసుకొస్తాం. యువ భారత్ స్వప్నాలు సాకారం చేస్తామన్నారు.