ముందస్తు ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది టీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచేసింది. ఇప్పటికే 105 స్ధానాలకు అభ్యర్థులను ప్రకటించి విపక్షాలకు షాకిచ్చిన కేసీఆర్ తాజాగా మిగిలిన 14 స్ధానాలకు అభ్యర్థుల ఎంపిక కసరత్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా గోషామహల్ నుంచి మాజీ మంత్రి దానం నాగేందర్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఈ నెల 13న ప్రకటించే లిస్టులో దానం పేరు ఉండనున్నట్లు సన్నిహితవర్గాల సమాచారం.
గ్రేటర్ నేతలతో సమావేశంలో కేసీఆర్ మిగితా స్ధానాలకు సంబంధించిన నిర్ణయాన్ని కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉత్తమ్ కుమార్‌తో దానం భేటీ అయినట్లు జరుగుతున్న ప్రచారంపై కూడా కేసీఆర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది.
కేసీఆర్ ప్రకటించిన 105 స్ధానాల్లో దానం పేరు లేకపోవడంతో ఆయన పార్టీ వీడుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ ప్రచారాన్ని ఖండించిన దానం …తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మాజీమంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ సుధారాణి, టీఆర్ఎస్ నేత ప్రదీప్‌రావు తదితర పేర్లపై అభిప్రాయ సేకరణ జరిపిన కేసీఆర్ ఈనెల 13న ఇక్కడి అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది.