కరీంనగర్ జిల్లా నుంచి వేరుపడి సిరిసిల్లా జిల్లాగా ఆవిర్భవించింది. ఈమేరకు ఇవాళ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు సిరిసిల్ల జిల్లాను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. తెలంగాణలో రాజన్న సిరిసిల్లను జిల్లా చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాజన్న సిరిసిల్ల ప్రజల తరుపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. వేములవాడ రాజన్న సమక్షంలో సిరిసిల్ల కొత్త జిల్లా ఏర్పడడం సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు. ‘చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా మనం దసరా పండుగను జరుపుకుంటాం. తన జాతి అస్థత్వాన్ని కాపాడడానికి… నీళ్లు, నిధులు, నియమకాల ప్రాతిపదికన ఉద్యమాన్ని నిర్మించి.. ఒకదశలో ఆమరణ నిరాహార దీక్షకు సైతం వెనకాడుకుండా చేసిన ఉద్యమాల ఫలితమే నేటి తెలంగాణ.’ అని అన్నారు.
తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పడిందంటే అది సీఎం కేసీఆర్ కృషి అని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్తగా ఏర్పడిందంటే కూడా అది సీఎం చలవేనన్నారు. చిన్న జిల్లాలతోనే అభివృద్ధి సాధ్యమని సీఎం కేసీఆర్ భావించారని అందుకే చిన్న జిల్లాలను ఏర్పాటు చేశారని తెలిపారు. జిల్లాలు, మండలాలు చిన్నగా ఉంటే ఎవరి కుటుంబం పరిస్తితి ఎలా ఉందో అధికారులు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు.
సిరిసిల్ల ఒకనాడు సిరిశాల కార్మికులు కృషి చేసిన పట్టణమని తెలిపారు. వేములవాడ ప్రముఖ పుణ్యక్షేత్రమని తెలిపారు. చేనేత కార్మీక మరియు రాజన్న ధార్మీక క్షేత్రాలను రెండింటిని కలిపి రాజన్న సిరిసిల్లగా ఏర్పాటు చేయడం ఆనందదాయకం అన్నారు. బంగారు తెలంగాణలో బాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు అందజేయాలనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొత్త జిల్లాలు ఏర్పడితే అవినీతి తగ్గుందన్నారు. ప్రజలకు సమర్థవంతమైన పాలన అందుతుందనే ఉద్దేశ్యంతో… ప్రజల కోరిక మేరకే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.