హీరో రవితేజ తమ్ముడు భరత్ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. తన సోదరుడి అంత్యక్రియలకు హాజరుకాలేనని టాలీవుడ్ ప్రముఖ హీరో రవితేజ అన్నారు. చిధ్రమైన తన తమ్ముడి భౌతిక కాయాన్ని చివరి చూపు చూసి భరించలేనని, దీన్ని అర్థం చేసుకోవాలంటూ రవితేజ మీడియాకు, మిత్రులకు చెప్పారు.
30 ఏళ్లుగా తన తమ్ముడు భరత్‌తో ఉన్న అనుబంధాన్ని రవితేజ ఈ సందర్భంగా గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భరత్ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులెవరూ కూడా హాజరుకాలేదని తెలిసింది. కుటుంబసభ్యులు ఎవరూ లేకుండానే భరత్ అంత్యక్రియలు జరిగాయి.
యాక్సిడెంట్ స్పాట్ నుండి భరత్ భౌతిక కాయాన్ని పోస్టు మార్టం నిమిత్తం మొదట ఉస్మానియాకు తరలించారు. అనంతరం మృత దేహాన్ని ఇంటికి కూడా తరలించకుండా నేరుగా మహాప్రస్తానం స్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. రవితేజ మూడో సోదరుడు రఘు అంత్యక్రియలను పర్యవేక్షించారు.
మహాప్రస్తానంలో జరిగిన అంత్యక్రియల్లో నటులు ఉత్తేజ్, జీవిత రాజశేఖర్, ఆలీ, రఘుబాబు, కుటుంబ సభ్యులు, పలువురు సమీప బంధువులు, మిత్రులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే..భరత్ భౌతిక కాయాన్ని చివరి చూపు చూసేందుకు కుటుంబ సభ్యులు ఎందుకు దూరంగా ఉన్నారని అందల్లోనూ అనుమానాలు మొదలయ్యాయి.
శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో భరత్ దుర్మరణం చెందారు. వేగంగా ప్రయాణిస్తున్న ఆయన కారు ఆగిఉన్న లారీని ఢీ కొట్టింది. ప్రమాదం జరిగినపుడు కారు 140 కి.మీ వేగంతో ఉండటంతో భరత్ అక్కడికక్కడే మృతిచెందారు.