ఎముకలు, కీళ్ల సమస్యలు ఇక వృద్ధులకే పరిమితం కావడం లేదు. భారతదేశవ్యాప్తంగా ఆర్థోపెడిక్ క్లినిక్‌లలో 30 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీరిలో ఉద్యోగస్తులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, ఎక్కువసేపు డెస్క్ వద్ద పని చేసే వారు, అప్పుడప్పుడూ వ్యాయామం చేసే ఫిట్‌నెస్ ఆసక్తి ఉన్నవారు కూడా ఉన్నారు. తమ కీళ్ల నొప్పి తాత్కాలికమని అనుకున్న చాలామందికి అది దీర్ఘకాల సమస్యగా మారడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
“ముందు వృద్ధుల్లో మాత్రమే చూసే కీళ్ల సమస్యలతో ఇప్పుడు 30ల ప్రారంభంలోనే ఉన్నవారు వస్తున్నారు,” అని న్యూఢిల్లీ సర్ గంగారామ్ హాస్పిటల్‌కు చెందిన ఆర్థోపెడిక్స్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ ఆశిస్ ఆచార్య తెలిపారు. “ఈ వయసు నుంచే ఎముకల సాంద్రత, కండరాల బలం సహజంగా తగ్గడం ప్రారంభమవుతుంది. కానీ నేటి జీవనశైలి ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తోంది” అని ఆయన అన్నారు.
35 ఏళ్లకే దీర్ఘకాలిక నడుము నొప్పి, 40 ఏళ్లకే మెట్లు ఎక్కేటప్పుడు మోకాళ్ల నొప్పి, 32 ఏళ్లకే తగ్గని మెడ, భుజాల గట్టిపడటం వంటి కేసులు సాధారణంగా మారాయి. “ఇవి ఒంటరి ఘటనలు కావు. సరైన బలం, విశ్రాంతి లేకుండా కీళ్లపై పడుతున్న నిరంతర ఒత్తిడికి ఇవి ఉదాహరణలు,” అని డా. ఆచార్య చెప్పారు.
ఎక్కువసేపు కూర్చునే పనుల వల్ల నడుము నొప్పి, బలహీనమైన కోర్ మసిల్స్, చిన్న గాయం అనుకుని పట్టించుకోని ప్రారంభ దశ మోకాళ్ల క్షీణత, స్క్రీన్ ముందు ఎక్కువసేపు ఉండడం వల్ల మెడ, పై వెన్నునొప్పి వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కువ విరామం తర్వాత ఒక్కసారిగా కఠిన వ్యాయామాలు ప్రారంభించేవారిలో టెండన్, లిగమెంట్ నొప్పులు కూడా సాధారణం.
ఈ దశలో ఉద్యోగ ఒత్తిడి, ఎక్కువ పని గంటలు, సరైన నిద్ర లేకపోవడం, ఒత్తిడి పెరగడం సాధారణం. బరువు పెరగడం, ఎక్కువ ప్రయాణాలు, స్క్రీన్ ఆధారిత ఉద్యోగాలు కీళ్లపై మరింత భారం పెడతాయి. కీళ్ల క్షీణత ఒక్కసారిగా జరగదు. నిశ్శబ్దంగా, ఏళ్ల తరబడి పెరుగుతుంది. నొప్పి స్థిరంగా మారే సమయానికి నష్టం ఇప్పటికే జరిగి ఉంటుందిని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
కోవిడ్ తర్వాత చాలా మందిలో శారీరక చురుకుదనం తగ్గడం, కండరాల బలం తగ్గడం, తగ్గని కీళ్ల నొప్పులు కనిపించాయి. ఇవి పూర్తిగా నయం కాకుండా కాలక్రమేణా తీవ్రతరం అయ్యాయి. ఎముకల బలహీనత వృద్ధాప్యంలోనే మొదలవుతుందని చాలామంది అనుకుంటారు. వాస్తవానికి గరిష్ట ఎముక బలం 20ల చివరలోనే వస్తుంది. ఆ తర్వాత ఎముకలు, కీళ్ల ఆరోగ్యం పూర్తిగా సంరక్షణపై ఆధారపడి ఉంటుంది. పోషకాహారం లోపం, విటమిన్ డీ కొరత, పొగతాగడం, అధిక మద్యం సేవనం, శారీరక చురుకుదనం లేకపోవడం— ఇవన్నీ ఎముకల బలహీనతను వేగవంతం చేస్తాయి. నొప్పి మందులు లేదా కుషన్‌లు తాత్కాలిక ఉపశమనం ఇస్తాయే తప్ప మూలకారణాన్ని పరిష్కరించవు.
తీవ్ర వ్యాయామాలు అవసరం లేదు. రోజంతా క్రమంగా కదలికలు ఉండడం చాలా ముఖ్యం. ప్రతి 30–45 నిమిషాలకు ఒకసారి నిలబడటం లేదా స్ట్రెచ్ చేయడం, వారానికి రెండు నుంచి మూడు సార్లు కాళ్లు, కోర్‌పై దృష్టి పెట్టిన బలం పెంచే వ్యాయామాలు చేయడం, స్క్రీన్ ఎత్తు, కూర్చునే భంగిమ వంటి ఎర్గోనామిక్స్‌పై శ్రద్ధ పెట్టాలని డా. ఆచార్య సూచిస్తున్నారు.
Also Read:టీటీడీ ఆలయాల్లో అన్నప్రసాదం

