వన్డే సిరీస్ విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. నేడు (ఆదివారం) జరిగే తొలి టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది. 5-1 తేడాతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న కోహ్లీ సేన పొట్టి ఫార్మాట్లోనూ దూకుడును ప్రదర్శించాలని ఉవ్విళ్లూరుతోంది.
వన్డే సిరీస్ సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన స్పిన్ ద్వయం కుల్దీప్, చాహల్ మరోసారి ప్రత్యర్థి జట్టును ముప్పుతిప్పలు పెట్టడానికి సిద్ధంగా ఉంది. మరోవైపు ఏడాది తర్వాత పునరాగమనం చేస్తున్న సురేష్ రైనాపైనే అందరి దృష్టి నెలకొంది. 2015లో చివరి వన్డే ఆడిన అతను టీ-20 మ్యాచ్ ఆడి కూడా దాదాపు ఏడాది దాటిపోయింది.
మరోవైపు ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఉన్న నేపథ్యంలో దక్షిణాఫ్రికా తమ జట్టులో చాలా మంది ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. కొత్త ముఖాలతో బరిలోకి దిగుతోంది. డుమిని, డివిలియర్స్ మినహా మిగిలిన వాళ్లంతా దాదాపు కొత్తవాళ్లే. వాండరర్స్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలించనుంది. అందువల్ల భారీ స్కోర్లు నమోదు కాగలవని అంచనా వేస్తున్నారు. సాయంత్రం 6 గంటల నుండి సోనీ టెన్-1, సోనీ టెన్-3 చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం.
భారత జట్టు : రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే/రైనా, ధోని, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్.
దక్షిణాఫ్రికా జట్టు : రీజా హెండ్రిక్స్, జాన్-జాన్ స్మట్స్, డివిలియర్స్, డుమిని, మిల్లర్/బెహర్డీన్, క్లాసన్, క్రిస్ మోరిస్, ఫెలుక్వాయో, జూనియర్ దలా, డేన్ ప్యాటర్సన్, ఫాంగిసో.