స్ధానికసంస్థల కోటాలో శాసనమండలి స్ధానాలకు అభ్యర్థులను ప్రకటించింది టీఆర్ఎస్. నల్గొండ నుండి సీనియర్ నేత తేరా చిన్నపరెడ్డి,రంగారెడ్డి నుండి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి,వరంగల్ నుండి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని ఖరారు చేసింది.
ఇక నల్గొండ నుండి పార్టీ సీనియర్ నేత తేరా చిన్నపరెడ్డిని బరిలోకి దించింది. 2015లో ఇదే స్ధానం నుండి పోటీ చేసిన ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. తాజాగా బరిలోకి దిగుతున్న తేరా గెలుపు నల్లేరుపై నడకే కానుంది.
టీడీపీ నుండి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన చిన్నపరెడ్డికి నల్గొండ జిల్లాలో మంచి పేరుంది. ఇండస్ట్రీయలిస్టుగా,శ్రీని ఫార్మ కంపెనీ ప్రమోటర్‌గా పార్మా రంగాన్ని శాసించారు. 2009లో టీడీపీ అభ్యర్ధిగా నాగర్జున సాగర్ నుండి పోటీచేసిన ఆయన జానారెడ్డికి గట్టిపోటీనిచ్చారు. కేవలం ఆరువేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.
2014లో నల్గొండ పార్లమెంట్ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి గుత్తా సుఖేందర్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అనంతరం టీఆర్ఎస్‌లో చేరిన ఆయన పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఆయన పార్టీకి చేసిన సేవలకు గుర్తుగా మరోసారి అవకాశాన్ని కల్పించారు కేసీఆర్.
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ నుండి ఎక్కువ సంఖ్యలో గెలిచారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వారంతా గులాబీ గూటికి చేరారు. దీంతో తేరా గెలుపు ఖాయమే కానుంది.మరోవైపు కాంగ్రెస్ ఇంకా తన అభ్యర్థికి ఖరారు చేయలేదు. సిట్టింగ్ స్ధానాన్ని నిలబెట్టుకునేందుకు ఆ పార్టీకి బలమైన అభ్యర్థి కనిపించడం లేదు. దీంతో అసలు కాంగ్రెస్ పోటీచేస్తుందా లేదా సందేహం అందరిలో నెలకొంది.