పోలవరం వల్ల భద్రాచలంకి ముప్పు : తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌

84
polavaram
- Advertisement -

పోలవరం బ్యాక్‌ వాటర్‌పై అధ్యయనం చేయాలని ప్రాజెక్ట్‌ అథారిటీని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇటీవల గోదావరికి పోటెత్తిన భారీ వరద నేపథ్యంలో తెలంగాణ నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌ పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీకి లేఖ రాశారు. పోలవరం బ్యాక్‌ వాటర్‌ ప్రభావంపై గతంలోనే కేంద్ర జలశక్తి బోర్డు దృష్టికి తీసుకెళ్లామని లేఖలో పేర్కొన్నారు. తాజాగా గోదావరికి భారీగా వరదలు రావడంతో భద్రాచలం వద్ద 99 గ్రామాలు ముంపునకు గురయ్యాయని… దాదాపుగా 27 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని స్పష్టం చేశారు. ఎఫ్‌ఆర్‌ఎల్‌ వద్ద నీటి నిల్వ ఉంటే ముంపు ఎక్కువగా ఉంటుందన్న ఈఎన్సీ మురళీధర్‌… 26లక్షల క్యూసెక్కుల బ్యాక్‌ వాటర్‌పై అధ్యయనం చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తయితే భద్రాచలానికి బ్యాక్‌ వాటర్‌ ముప్పు ఎప్పటికీ ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తే ఏటా భద్రాచలానికి ముంపు తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని పోలవరం బ్యాక్‌ వాటర్‌పై స్వతంత్ర సంస్థ ద్వారా అధ్యయనం చేయించాలని తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ ప్రాజెక్ట్‌ అథారిటీని కోరారు.

- Advertisement -