వాట్సాప్…ప్రస్తుతం మన జీవితంలో ఒక భాగం అయ్యింది. ఏదైనా ఇప్పుడున్న రోజుల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సిందే లేదంటే పట్టించుకోవటం మానేస్తారు. అందుకే ఫేస్బుక్, వాట్సాప్ ఎప్పటికప్పుడు జనాలకు నచ్చినట్టు అప్డేట్ అవ్వబట్టే అందరి చేతుల్లోనూ అవే కొనసాగుతున్నాయి. ఇక తాజాగా మరో ఫీచర్‌ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది వాట్సాప్.
భారతదేశ వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్ `లైవ్ లొకేషన్`ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది. దీని సాయంతో వినియోగదారులు తాము ఉన్న స్థానాన్ని తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు. లొకేషన్ పంచుకునే సదుపాయం ఇప్పుడు కూడా వాట్సాప్‌లో ఉంది. కాకపోతే ఈ లైవ్ లొకేషన్ ద్వారా స్థానాన్ని మరింత కచ్చితత్వంతో పంచుకోవచ్చు. అంటే సరిగ్గా నిల్చున్న చోటును స్నేహితులకు పంపుకోవచ్చు. అంతేకాకుండా టైమర్ సెట్ చేసుకునే అవకాశం కూడా ఉండనుంది.
దీని వల్ల మన లొకేషన్‌ను ఎంతసేపు పంచుకోవాలో నిర్ణయించుకోవచ్చు. ఈ సదుపాయం వల్ల పిల్లలకు, మహిళలకు మరింత ఉపయోగం చేకూరనుంది. లొకేషన్ పంచుకోవడంతో పాటు, ఎంతసేపు అదే స్థానంలో ఉండబోతున్నారో కూడా తెలియజేసే వీలుంది. అయితే ఈ సరికొత్త ఫీచర్ ఈ వారం అప్‌డేట్‌తో అందుబాటులోకి రానుంది.