ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సప్. ఎన్నో ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చినా.. వాట్సప్ ఆకట్టుకున్నంతగా ఆకర్షించలేకపోయాయి. అయితే ఇతర యాప్‌లతో పోలిస్తే ఫీచర్లు కొంత తక్కువే అయినా, ఉన్నంతలో క్వాలిటీ ఫీచర్స్‌ను అందించే ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌గా వాట్సప్ పేరుగాంచింది. ఈ క్రమంలోనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్. ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్పాప్‌ను వాడే బీటా యూజర్లకు ఇప్పుడు వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్ లభిస్తుంది.
వాట్సాప్‌కు చెందిన బీటా వెర్షన్ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై వాడే యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలోనే సదరు యూజర్లు చాట్ విండోలోనే ఈ ఫీచర్‌ను యాక్సస్ చేసుకోవచ్చు. గ్యాలరీ, వీడియో, డాక్యుమెంట్లు వంటి ఇతర ఆప్షన్లతో పాటు ఈ ఆప్షన్ కూడా ఇక అందుబాటులో ఉంటుంది. పేమెంట్స్‌ను క్లిక్ చేస్తే.. ఓ డిస్‌క్లెయిమర్ విండో ఓపెన్ అవుతుంది. దీంట్లో బ్యాంకుల జాబితా కూడా ఉంటుంది.
ఈ క్రమంలో యూపీఐతో కనెక్ట్ అయిన బ్యాంకు అకౌంట్‌ను యూజర్లు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో సదరు అకౌంట్ నుంచి నేరుగా నగదును ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పటి వరకు యూపీఐ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్‌ను యూజర్లు వాడి ఉండకపోతే, ముందుగా పిన్‌ను క్రియేట్ చేసుకోవాలి. అదనంగా యూపీఐ యాప్ ద్వారా లేదా సంబంధిత బ్యాంకు వెబ్‌సైట్ ద్వారా యూపీఐ అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి. దీంతో వాట్సాప్‌లో పేమెంట్స్ ఫీచర్‌ను వాడుకునేందుకు వీలుంటుంది.
ఇక లావాదేవీని విజయవంతంగా పూర్తిచేసుకోవాలంటే నగదు పంపేవారికి, స్వీకరించే వారికి ఇద్దరికీ కచ్చితంగా వాట్సాప్ ఆఫర్ చేసే పేమెంట్స్ ఫీచర్ ఉండాలి. వాట్సాప్ అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ పేమెంట్స్ ఫీచర్ ఐఓఎస్‌లోని 2.18.21 వాట్సాప్ బీటా వెర్షన్‌కు, ఆండ్రాయిడ్ 2.18.41 బీటా వెర్షన్ వారికి అందుబాటులో ఉంది. త్వరలో పూర్తి స్థాయిలో ఈ ఫీచర్ యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది.