ముస్లిం మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలపనుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్ తెలిపారు. అలాగే ముస్లిం మహిళలకు రక్షణ కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ట్రిపుల్ తలాక్ వ్యతిరేక బిల్లు శుక్రవారం పార్లమెంటుకు రానుంది అన్నారు.
ఈ బిల్లుకు ఇప్పటికే కేంద్ర కాబినెట్ ఆమోదం తెలపడంతో బిల్లు పై పార్లమెంటులో చర్చ జరగనుంది. చర్చ అనంతరం సభ్యుల ఆమోదంతో ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా చట్టం రూపొందించనున్నారు.
ఈ చట్టాన్ని వ్యతిరేకించిన వారికి బెయిల్ కూడా వచ్చే అవకాశం లేదు. దీంతో పాటు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. ముస్లిం పురుషులు వారి భార్యలకు మౌఖికంగా, రాతపూర్వకంగా, ఈమెయిల్, ఎస్‌ఎంఎస్, వాట్సప్ వంటి మాధ్యమాల ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పినా దాన్ని చట్టవిరుద్ధంగానే పరిగణలోకి తీసుకొనున్నారు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్‌జైట్లీ, రవిశంకర్‌ప్రసాద్, పీపీ చౌదరితో కూడిన బృందం ఈ బిల్లును రూపొందించింది.