రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..

345
- Advertisement -

ఈసారి ఎండలే ఎండలు.. మండిపోతాయట. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో అత్యధికంగా 43-47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదువుతుందని అంచనా వేస్తున్నట్లు బేగంపేట వాతావరణశాఖ డైరెక్టర్‌ వైకే రెడ్డి తెలిపారు. ఏప్రిల్‌, మే నెలల్లో అనేక చోట్ల సాధారణ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలుగా పరిగణిస్తారు. అక్కడక్కడా 42 నుంచి 43 డిగ్రీలు కూడా సాధారణం కిందే లెక్క. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటితే ఎండ ప్రభావం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆదిలాబాద్‌, రామగుండం, మెదక్‌, నిజామాబాద్‌, కర్నూలు, కడప, నందిగామ, జంఘమహేశ్వరపురం, ఒంగోలు, గన్నవరం వంటి కేంద్రాల్లో రోజుల తరబడి 40 డిగ్రీలు నమోదవుతుంటాయి.

కొన్నిచోట్ల 43 డిగ్రీలు కూడా సాధారణ ఉష్ణోగ్రతగా ఉంటుంది. వాయువ్య భారతంలో తీవ్రమైన వడగాడ్పులు కొనసాగితే ఆ ప్రభావం మధ్యభారతం, దానికి ఆనుకుని విదర్భ, ఉత్తర తెలంగాణ వరకూ ఉంటుందని ఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణ విభాగం విశ్రాంత ఆచార్యుడు భానుకుమార్‌ చెప్పారు.

Weather Report

దక్షిణ కొరియాలోని బుసాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఏపీఐఐసీ నివేదిక మేరకు మార్చి నుంచి జూలై వరకు భారత్‌లో వేసవి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా వుంటాయి. అయితే దక్షిణాదిలో మాత్రం సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని విశ్లేషించింది. నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయానికే దేశంలో ప్రవేశిస్తే జూన్‌ నుంచి ఎండలు తగ్గుతాయనేది మరో వాదన.

2017 ఫిబ్రవరి ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే… ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతల కంటే కొంత అధికంగా నమోదయ్యాయి. గతేడాది ఫిబ్రవరి 21న అత్యధికంగా 37.8 డిగ్రీలు నమోదు కాగా, మార్చిలో 41, ఏప్రిల్‌లో 43, మే నెలలో 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు కూడా ఇదే స్థాయిలో ఉండే అవకాశం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు అంటున్నారు. గత పదేళ్లలో హైదరాబాద్‌లో 2009 ఫిబ్రవరి 26న 39.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

- Advertisement -