‘ఇది పెద్ద విజయం. 1980లో మనవి రెండు సీట్లు మాత్రమే. ఇప్పుడు ఏకంగా 19 రాష్ట్రాల్లో మనం అధికారంలో ఉన్నాం. ఆఖరికి ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 18 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది’ అన్నారు ప్రధాని నరేంద్రమోదీ.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నాయకత్వంలో ఆ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారిరువురికీ ఢిల్లీలో బీజేపీ పెద్దలు సన్మానం చేశారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ… భావోద్వేగానికి గురయ్యారు. తన దేహం దేశం కోసమే అని మోదీ భావోద్వేగపూరితంగా చెప్పారు. అధికారాన్ని సాధించడం ప్రజల కోసమేనని, వారిని మేలు చేయడానికేనని వ్యాఖ్యానించారు. తన నుంచి ఇంకా ఎంత పని ఆశిస్తున్నారో అదంతా చేసి చూపెడతానని మోదీ చెప్పారు. అంతేకాకుండా బీజేపీ విజయం సాధించిన ఈ ఆనందంతో ఎవరూ అతిగా ఉప్పొంగవద్దని సూచించారు.
కాగా…ప్రధాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటూ, పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాలు లేవనెత్తుతున్న అంశాలపై చర్చించారు.