నేడు (ఆదివారం) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ టైటిల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడటానికి ఇంకా కొన్ని గంటలు సమయం మాత్రమే ఉంది. సీజన్ ఆరంభం నుంచి ఇరు జట్లు పాయింట్ల పట్టికలో మొదటి, రెండు స్థానాలలో ఉంటూ ఫైనల్ దూసుకెళ్లాయి.
ఇక ఐపీఎల్ కెప్టెన్‌లలో స్పెషల్‌గా ఉంటూ తన ఆట తీరుతో, నాయకత్వ లక్షణాలతో అందరి దృష్టిని ఆకర్శిస్తున్నాడు చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. రెండేళ్ల విరామం తర్వాత కూడా ఎక్కడా మొక్కవోని విశ్వాసంతో తమ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. 9 సీజన్లలో ధోనీ సారధ్యం వహించి తమ జట్టును 7సార్లు ఫైనల్‌కు చేర్చడం విశేషం. ఇక నేడు ఫైనల్ పోరుకు సిద్దమవుతుండటంతో మీడియాతో తన అభిప్రాయలను పంచుకున్నాడు కుల్ కెప్టెన్ ధోనీ.
ఈ సీజన్ ప్రారంభంలో కాస్త టెన్షన్ ఉన్నా.. మ్యాచ్‌లు ఆడుతున్న కొద్దీ మాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. కానీ చెన్నైలో మ్యాచ్‌లు జరగకపోవడం మమ్మల్ని చాలా నిరాశకు గురిచేసింది. ఆట పట్ల నమ్మకం ఉన్నవారు ఎక్కడైనా రాణిస్తారన్నారు. ఇక నేటి ఫైనల్‌లో ఆటగాళ్ల సమిష్టి కృషి ఉంటే విజయం మాదే అని గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.