దేశంలో తొలి గ్రామ్‌ఫోన్ రికార్డింగ్ గాయనిగా చరిత్రను సృష్టించిన గౌహర్‌జాన్ జీవితం ఇప్పుడు తెరపైకి రానుంది. ఇప్పటికే బాలీవుడ్‌లో బయోపిక్‌ల పరంపర కొనసాగుతుందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు భిన్న రంగాల్లో ప్రతిభను చాటిన పలువురు ప్రముఖుల జీవితాల్ని వెండితెరపై ఆవిష్కృతం చేసేందుకు దర్శకనిర్మాతలు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు.
ఈ క్రమంలోనే గౌహర్‌జాన్ జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ..అమెరికా సంతతికి చెందిన గౌహర్‌జాన్ భారతీయ కళలపై మక్కువతో శాస్త్రీయ సంగీతంలో ప్రావీణ్యాన్ని సంపాదించుకుంది. దేశంలోనే తొలిసారి గ్రామ్‌ఫోన్ రికార్డుల రూపంలో ఆమె పాడిన గీతాలు విడుదలయ్యాయి. గౌహర్‌జాన్ జీవితంలోని పలు ఆసక్తికరమైన కోణాలతో అమీర్‌ఖాన్ సతీమణి, దర్శకురాలు కిరణ్‌రావ్ ఓ సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు.
గౌహర్‌జాన్ నేపథ్యం గురించి చాలా మందికి తెలియదని, ఆమె జీవితంపై సినిమాను తెరకెక్కించాలని చాలా రోజులుగా అనుకుంటున్నానని కిరణ్‌రావ్ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన కథ సిద్ధమైనట్లు తెలిసింది. అయితే గౌహర్‌జాన్ పాత్రలో దీపికా పదుకునే నటించనున్నట్లు సమాచారం. ఇందు కోసం ప్రత్యేకంగా ఆమె శిక్షణ తీసుకుంటున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాత్ర కోసం శాస్త్రీయ సంగీతంపై కూడా పట్టు సాధించే పనిలో దీపికా పదుకునే ఉన్నట్లు తెలిసింది.