రంగస్థలం హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం వినయ విధేయ రామ. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందడంలో విఫలమైంది. చెర్రీ నటనకు మంచి మార్కులేపడ్డా కథా,మాస్ ఎలిమెంట్స్ పరంగా ప్రేక్షకులను నిరాశపర్చింది.
ఈ సందర్భంగా అభిమానులకు బహిరంగలేఖ రాశారు రామ్ చరణ్. ప్రేక్షకులు, అభిమానుల ప్రేమ, ఆదరణను ప్రేరణగా తీసుకుని భవిష్యత్తులో అందరూ మెచ్చే సినిమాలు చేస్తానని అన్నారు. ఈ సినిమా ద్వారా మీ అంచనాలను అందుకోలేకపోయామన్నారు.
ప్రియమైన అభిమానులు, ప్రేక్షకులకు.. నా పట్ల, మా సినిమా పట్ల మీరు చూపించిన ప్రేమ, అభిమానాలకు వినయపూర్వక ధన్యవాదాలు. మా ‘వినయ విధేయ రామ’ సినిమా కోసం రేయింబవళ్లు కష్టించిన సాంకేతిక నిపుణులు అందరికీ నా ధన్యవాదాలు. నిర్మాత దానయ్య అందించిన సహకారం మాటల్లో వర్ణించలేనిది. మా చిత్రాన్ని నమ్మిన పంపిణీదారులు, ప్రదర్శన దారులకు కృతజ్ఞతలు.
మీ అందరికీ నచ్చి, వినోదం పంచే సినిమా అందించటానికి మేమంతా ఎంతగానో శ్రమించాం. దురదృష్టవశాత్తు మేము అనుకున్న విధంగా ఒక మంచి సినిమాను అందించలేక మీ అంచనాలని అందుకోలేకపోయాం. మీరు చూపించే ఈ ఆదరణ, అభిమానాన్ని ప్రేరణగా తీసుకుని భవిష్యత్తులో మీకు నచ్చే, మీరు మెచ్చే సినిమాలు చేయటానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. అన్ని వేళలా మద్దతు అందించిన మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు. మీరు ఎల్లప్పుడూ చూపించే ఈ ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు. ప్రేమతో.. మీ రామ్‌చరణ్ అంటూ తెలిపారు.