దేశ వ్యాప్తంగా 17వ సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. పలు రాష్ట్రాల్లో చిన్న చిన్న ఘర్షణలు మినహా.. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. మొత్తం ఏడు విడుతల్లో 542 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 545 లోక్ సభ స్థానాలు ఉండగా.. ఇందులో రెండు స్థానాల్లో ఆంగ్లో ఇండియన్స్ ను నామినేట్ చేస్తారు.
ఈ క్రమంలో 543 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 542 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరగని ఆ ఒక్క లోక్ సభ స్థానం తమిళనాడులోని వేలూరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఓ అభ్యర్థికి చెందిన నగదు పెద్ద మొత్తంలో లభించడంతో ఎన్నికను రద్దు చేశారు.
ఇక ఈ రోజు జరిగిన 7వ దశ ఎన్నికల్లో మొత్తం 53.03 శాతం ఓటింగ్ నమోదైంది. బీహర్‌లో 46.75 శాతం, మధ్యప్రదేశ్‌లో 59.75 శాతం, పంజాబ్ 50.49 శాతం, ఉత్తర్‌ప్రదేశ్ 47.21 శాతం, వెస్ట్ బెంగాల్ 64.87 శాతం, జార్ఖండ్ 66.64శాతం చంఢీగర్ 51.18 శాతం నమోదైంది.
వెస్ట్ బెంగాల్‌లో ఈ విడతలో కూడా పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకోగా.. మిగతా చోట్ల ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5.00 గంటల వరకు లైన్లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని అధికారులు వెల్లడించారు. కాగా ఈ నెల 23న ఫలితాలు వెలువడనున్నాయి.