ఆర్ కే నగర్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 256 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. అన్నాడీఎంకే, డీఎంకే,బీజేపీతో పాటు స్వతంత్ర అభ్యర్థి టీటీవీ దినకరన్, బీజేపీ, ఇతర పార్టీల అభ్యర్థులు కలిపి మొత్తం 59 మంది బరిలో ఉన్నారు. పోలింగ్ నేపథ్యంలో అన్ని కేంద్రాల వద్ద పోలీసులు, పారామిలటరీ బలగాలతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్‌స్వ్కాడ్‌లు, వీడియో మానిటరింగ్ టీమ్స్ ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యాయి.
గతేడాది డిసెంబరులో అప్పటి సీఎం జయలలిత మరణంతో ఆర్కేనగర్ నియోజకవర్గం స్థానం ఖాళీ అయింది. అప్పటి నుంచి ఆరు నెలల్లో ఉప ఎన్నిక జరగాల్సి ఉండగా… ఈ ఏడాది ఏప్రిల్ 12న ఈసీ పచ్చజెండా వూపింది. పెద్ద మొత్తంలో నగదు పంపిణీ చేశారనే ఫిర్యాదులతో పోలింగ్‌కు ఒక రోజు ముందు ఎన్నికను రద్దు చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాది కాలంలో రాష్ట్రంలో రాజకీయంగా చోటు చేసుకున్న పరిణామాలు, అధికార పార్టీలో వచ్చిన మార్పులు తదితర అంశాల నేపథ్యంలో మరోసారి గురువారం ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ నెల 24న ఓట్ల లెక్కింపు జరగనుంది. అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా దీనిపై ఇప్పటికే ప్రచారం సాగిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.