ఓటుకు నోటు కేసులో త్వరలోనే ఫైనల్ జడ్జిమెంట్..?

234
revanth reddy
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పాదయాత్రలతో తనకు పీసీసీ ప్రెసిడెంట్ పదవి దక్కకుండా చేస్తున్న కాంగ్రెస్ సీనియర్‌ నేతలకు చెక్ పెట్టే పనిలో ఉంటే..మరో పక్క ఏసీబీ కోర్టు ఓటుకు నోటు కేసు విచారణలో తన పనితాను చేసుకుంటూ పోతుంది. పాదయాత్ర ముగింపు రోజున రావిలాలలో రైతు రణభేరీ సభలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రతో ఉప్పెన సృష్టిస్తా…కేసీఆర్‌ను కప్పేస్తా అంటూ రేవంత్‌రెడ్డి రెచ్చిపోయిన టైమ్‌లోనే రేవంత్‌రెడ్డికి ఏసీబీ కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా రేవంత్‌రెడ్డిపై ఏసీబీ కోర్టు అభియోగాలను నమోదు చేయడం కాంగ్రెస్ శ్రేణులకు, రేవంత్‌ అభిమానులకు షాకింగ్‌ గా మారింది.

2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలవడం కోసం చంద్రబాబు చేసిన కుట్రలో భాగమైన రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నాడు. ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ ఓటు కోసం ఆయన ఇంటికి వెళ్లి 5 కోట్లకు బేరం కుదుర్చుకోవడమే కాకుండా స్వయంగా రూ. 50 లక్షలు ఇస్తూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. అప్పుడు రాష్ట్ర విభజన నేపథ్యంలో అప్పుడు తెలుగు ప్రజల మధ‌్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ‌్యంలో కేంద్రం జోక్యం మేరకు ఓటుకు నోటు కేసు మూలకు పడింది. ఆ తర్వాత తెలంగాణలో టీడీపీ పూర్తిగా సమాధి అవడంతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నేతలకు చెక్ పెట్టి పీసీసీ పదవి దక్కించుకునేందుకు పాదయాత్రలు చేస్తూ హడావుడి చేస్తున్నాడు.

అయితే రాజకీయ నాయకులపై ఉన్న పెండింగ్‌ కేసుల విచారణను సత్వరమే పూర్తి చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ కోర్టు మళ్లీ ఓటుకు నోటు కేసుపై విచారణను స్పీడప్ చేస్తోంది. ఇప్పటికే ఈ ఓటుకు నోటు వ్యవ్యహారం ఎలక్షన్‌ కమీషన్ పరిధిలోకి వస్తుంది కావున..ఈ కేసు నుంచి తప్పించాలంటూ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన డిశ్చార్చి పిటీషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. తాజాగా ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితులైన రేవంత్ రెడ్డి, ఉదయ్‌సింహా, సెబాస్టియన్‌లపై ఏసీబీ కోర్టు అభియోగాలను నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12 కింద నమోదు రేవంత్ రెడ్డి, ఇతరులపై ఐపీసీ 120బి రెడ్ విత్ 34 కింద అభియోగం నమోదైంది. అయితే తమ పేర్లను ఈ కేసు నుంచి తొలగించాలంటూ ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, హ్యారీ సెబాస్టియన్‌లు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్‌ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసిన సంగతి తెలిసిందే.

కాగాఓటుకు నోటు కేసుకు సంబంధించి, ఆడియో, వీడియో టేపులతో సహా అన్ని ఆధారాలు ఉన్నాయని ఏసీబీ తెలిపింది. రూ.50లక్షలు ఇస్తూ రేవంత్ రెడ్డితో సహా మిగిలిన నిందితులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని ఏసీబీ న్యాయవాదులు న్యాయస్థానానికి వివరించారు. దీంతో ఈనెల 19న సాక్షుల విచారణ, షెడ్యూలును ఖరారు చేస్తామని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. మొత్తంగా పాదయాత్రతో ఫుల్ జోష్‌లో ఉన్న రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసులో వేగంగా జరుగుతున్న విచారణ షాకింగ్‌గా మారింది. మరోవైపు ఓటుకు నోటు కేసులో ఏసీబీ అభియోగాలు నమోదు చేయడంతో రేవంత్ రెడ్డి, ఆయన అనుచరుల్లో ఆందోళన నెలకొంది. ఏసీబీ కోర్టు తుది తీర్పు ఎలా ఇస్తుందోనని రేవంత్ రెడ్డిని టెన్షన్ పెట్టిస్తోంది. ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టు ఇచ్చే తీర్పుపై రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

- Advertisement -