పెద్దపల్లి పార్లమెంట్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికార టీఆర్ఎస్ టికెట్ ఆశీంచి భంగపడ్డ మాజీ ప్రభుత్వ సలహాదారు,మాజీ ఎంపీ వివేక్ బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా బీజేపీ పెద్దపల్లి ఎంపీగా పోటీచేసే వ్యక్తి పేరు ప్రకటించడంతో ఆయన బీఎస్పీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వివేక్ పని చేశారంటూ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు రిపోర్ట్ ఇవ్వడంతో వివేక్‌ను పక్కన పెట్టి నేతకాని వెంకటేష్ పేరును ప్రకటించారు కేసీఆర్. ఇంత కాలం టిక్కెట్ వస్తుందనే ధీమతో ఉన్న వివేక్ అధినేత ఇచ్చిన షాక్‌తో డైలమాలో పడ్డారు.
బీజేపీ నేతలు పలుమార్లు వివేక్‌తో సంప్రదింపులు జరిపారు. ఇందుకోసమే పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించకుండా బీజేపీ శనివారం మధ్యాహ్నం వరకు పెండింగ్‌లో పెట్టింది. అయితే వివేక్‌తో చర్చలు సఫలం కాకపోవడంతో బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా ఎస్.కుమార్‌ను ఆపార్టీ ప్రకటించింది.
దీంతో కాంగ్రెస్,బీజేపీ రెండు డోర్‌లు మూసుకుపోవడంతో ప్రత్యామ్నాయ బీజేపీ వైపు చూస్తున్నారు వివేక్. ఇవాళే నామినేషన్లకు చివరిరోజు కావడంతో ఏ క్షణమైన ఆయన బీఎస్పీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వివేక్ సోదరుడు మాజీ మంత్రి వినోద్ సైతం టీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో బీఎస్పీ తరపున బెల్లంపల్లి అసెంబ్లీ నుండి పోటీచేశారు. టీఆర్ఎస్‌కు గట్టిపోటీనిచ్చిన ఆయన రెండోస్ధానంలో నిలిచారు. తాజాగా వివేక్ కూడా బీఎస్పీలో చేరుతారనే ప్రచారం జరుగుతుండటంతో ఫలితం ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.