‘మా’ ఎన్నికలు: విష్ణు ప్యానల్‌పై ప్రకాశ్‌ రాజ్‌ ఫిర్యాదు

173
Prakash Raj
- Advertisement -

‘మా’ ఎన్నికల వ్యవహారం రోజు రోజుకు మరింత వేడెక్కుతోంది. మంచు విష్ణు ప్యానల్‌పై ప్రకాశ్‌ రాజ్‌ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని మంచు విష్ణు ప్యానల్‌ ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ‘మా’ ఎన్నికల్లో ఈవీఎంలు వద్దని, బ్యాలెట్ లే వాడాలని ఎన్నికల అధికారికి మంచు విష్ణు లేఖ రాసిన నేపథ్యంలో.. ప్రకాశ్ రాజ్ కూడా విష్ణుపై ఎదురు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం ప్రకాశ్ రాజ్.. విష్ణు ప్యానెల్‌పై సంచలన ఆరోపణలు చేశారు.

ప్రకాశ్‌ రాజ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ఏజెంట్లతో కలిసి ‘పోస్టల్ బ్యాలెట్ల’ కుట్ర చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 60 ఏళ్లు నిండిన వారంతా పోస్టల్ బ్యాలెట్ కు అర్హులని, దీంతో వారి నుంచి విష్ణు ప్యానెల్ సభ్యులు సంతకాలు సేకరిస్తున్నారని చెప్పారు. నిన్న సాయంత్రం విష్ణు తరఫు వ్యక్తి ఒకరు 56 మంది నుంచి సంతకాలు సేకరించారని, వారి పోస్టల్ బ్యాలెట్ ఫీజు రూ.28 వేలు కట్టారని చెప్పారు.

కృష్ణ, కృష్ణంరాజు, శారద, పరుచూరి బ్రదర్స్, శరత్ బాబు తదితరుల ఫీజునూ విష్ణు తరఫు వ్యక్తే కట్టారని ఆరోపించారు. ఆగంతుకులతో ‘మా’ ఎన్నికలను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. గెలిచేందుకు ఇంత దిగజారుతారా? అని నిలదీశారు. హామీలు చెప్పి గెలవాలని సవాల్ విసిరారు. దీనిపై కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున పెదవి విప్పాలని డిమాండ్ చేశారు. మరి ప్రకాశ్ రాజ్ ఆరోపణలపై మంచు ప్యానల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

- Advertisement -