ప్రపంచ క్రికెట్లో ఇప్పటికే ఎన్నో రికార్డులను నెలకొల్పిన భారత క్రికెటర్, పరుగుల మెషీన విరాట్ కోహ్లి రికార్డులు బ్రేక్ చేశాడు. ఫిరోజ్ షా కోట్లా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో డబుల్ సెంచరీ (243) చేసిన టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ రెండో రోజు మరిన్ని రికార్డులు బద్దలుగొట్టాడు. కెప్టెన్‌గా ఆరు డబుల్ సెంచరీలు బాది ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన కోహ్లీ రికార్డులను తన ఖాతాలో వేసుకుంటూ పోతున్నాడు.
ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 500కుపైగా పరుగులు చేసిన కోహ్లీ మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో 1999-00లో సచిన్ టెండూల్కర్ న్యూజిలాండ్‌పై చేసిన 435 పరుగుల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. అలాగే, 1993లో వినోద్ కాంబ్లీ, 2008లో వీరేంద్ర సెహ్వాగ్ 500కు పైగా పరుగులు సాధించగా, తాజాగా కోహ్లీ ఆ ఘనత సాధించాడు.
విరాట్ తన కెరీర్ బెస్ట్ స్కోర్‌ను ఇప్పటికి 14 సార్లు సవరించుకున్నాడు. గతంలో దిలీప్ వెంగ్‌సర్కార్ 11సార్లు ఇలా సవరించుకున్నాడు. తాజా టెస్టులో 243 పరుగులు చేసిన కోహ్లీ టెస్ట్ కెరీర్‌లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. 2016లో ముంబైలో ఇంగ్లండ్‌పై చేసిన 235 పరుగులను ఇప్పుడు దాటేశాడు. ఒకే కేలండర్ ఇయర్‌లో వెయ్యికి పైగా పరుగులు సాధించిన తొలి ఇండియన్ కెప్టెన్ కోహ్లీనే. గతేడాది టెస్టుల్లో కోహ్లీ 75.93 సగటుతో 1215 పరుగులు చేయగా ఈ ఏడాది ఇప్పటి వరకు 77.61 సగటుతో 1000కిపైగా పరుగులు చేశాడు.