రూ.500, రూ.1,000 నోట్లను రద్దుచేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న సంచలన నిర్ణయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్‌తోపాటు ఇతర ప్రముఖులు ట్వీటర్‌లో మోదీపై అభినందనల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా పెద్ద నోట్ల రద్దు వ్యవహారం దేశ రాజకీయ చరిత్రలోనే అద్భుతమైన చర్యగా టెస్ట్ కెప్టెన్ కోహ్లీ అభివర్ణించాడు. గురువారం విశాఖలో భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ‘నాకు సంబంధించినంత వరకు పెద్ద నోట్ల రద్దు దేశ రాజకీయ చరిత్రలోనే అద్భుతమైన చర్య. ఇది నన్నెంతో ఆకట్టుకొందని… నమ్మశక్యం కానిదని కోహ్లీ పేర్కొన్నాడు. ప్రస్తుతం చలామణిలో లేని రూ.500, రూ.1000 నోట్లపై ఆటోగ్రాఫ్‌లు పెట్టి అభిమానులకు అందజేయగలనని సరదాగా వ్యాఖ్యానించాడు. ‘పెద్ద నోట్లు చెల్లవనే విషయం గుర్తులేక రాజ్‌కోట్‌లో నా హోటల్ బిల్లు చెల్లించడానికి పాత కరెన్సీ బయటకు తీశాను. ఇప్పుడు వాటిపై సంతకాలు చేసి అభిమానులకు ఇవ్వగలను. పరిస్థితి అంతలా మారిపోయింద’ని కోహ్లీ అన్నాడు.
భారత క్రికెట్ జట్టు కోచ్ అనిల్ కుంబ్లే ఇది మాసివ్ గూగ్లీ ,వెల్డన్ సర్, ప్రౌడ్ ఆఫ్ యూ సర్ అంటూ ట్వీట్ చేయగా. . దూస్రా స్పెషలిస్ట్ హర్భజన్ సింగ్ కూడా తనదైన క్రికెట్ భాషలో చెలరేగిపోయాడు. ప్రధాని బ్రహ్మాండమైన సిక్సర్ కొట్టారంటూ ట్వీట్ చేశాడు. తమ బౌలింగ్ ద్వారా ఎంతో మంది బ్యాట్స్ మెన్లకు షాకిచ్చిన ప్రముఖ భారత క్రికెటర్లు స్పందన అంటూ మోడీ రీట్వీట్ చేశారు.