టాలీవుడ్ నూతన దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వంలో రూపొందిన ‘అర్జున్ రెడ్డి’ క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. యువ ప్రేక్షకులు, విమర్శకుల నుండి ఉత్తమమైన ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఈ ఏడాది తెలుగు పరిశ్రమ అందుకున్న విజయాల్లో ఒకటిగా నిలిచింది. బలమైన కథాంశం, ఆకట్టుకునే కథానాయకుడి పాత్ర, దర్శకుడు దాన్ని తెరపై మలచిన తీరు, అందులో విజయ్ దేవరకొండ నటన అన్నీ అద్భుతంగా కలిసి సినిమాను గొప్పగా తీర్చిదిద్దాయి. అందుకే ఈ సినిమాతో హీరో విక్రమ్ తన కొడుకు ధ్రువను హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నాడు.
అర్జున్ రెడ్డి సినిమాను తమిళంలో ‘వర్మ’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనేది ఇంకా డిసైడవలేదు. ప్రస్తుతం ఆడిషన్స్ చేస్తున్నారు. ఇంట్రస్ట్ ఉన్నవాళ్లు అప్లయ్ చేసుకోవచ్చంటూ ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చాడు హీరో విక్రమ్. వర్మ ప్రేయసి ఎలా ఉండాలనే దానిపై ఓ వీడియో ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. సముద్రపు ఒడ్డున ఓ సుందరి సరదాగా విహరిస్తున్నట్టుగా ఈ వీడియో ఉంటుంది. ఇందులో హీరోయిన్ కు కావాల్సిన క్వాలిటీలూ చెప్పారు. ఆమె అందంగా… ఫన్నీగా ఉండాలి. క్యూట్ గా.. సిల్లీ గా ఉండాలి. దేవతలా ఉండాలి… అలాగే రాక్షసిలానూ అనిపించాలి. అలా ఉండి ఇంట్రస్ట్ ఉన్నవాళ్లంతా వీలైనంత త్వరగా డిటైల్స్ పంపాలని మెయిల్ ఐడీ ఇచ్చారు.
విక్రమ్ పోస్ట్ చేసిన వీడియోలో ఓ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ వస్తూ ఉంటుంది. ఆ వాయిస్ ఇచ్చింది హీరోయిన్ శ్రుతిహాసన్. అందుకు విక్రమ్ ఆమెకు థ్యాంక్స్ కూడా చెప్పాడు. వర్మ సినిమాకు శివపుత్రుడు.. వాడు-వీడు ఫేం డైరెక్టర్ బాల దర్శకత్వం చేయనున్నాడు. అయినా విక్రమ్ హీరోయిన్ కు కావాల్సిన క్వాలిటీలన్నీ బాగానే చెప్పాడు కానీ చాలా బోల్డ్ గా ఉండాలనే విషయం మాత్రం చెప్పలేదు.