సినీ నటి,దర్శకురాలు విజయనిర్మల అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. నానక్ రామ్ గూడ్‌లోని నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. చిలుకూరిలో విజయకృష్ణ గార్డెన్‌లో విజయనిర్మల అంత్యక్రియలు జరగనున్నాయి. కడసారిగా తమ అభిమాన నటిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
ఉదయం 11 గంటలకు అంతిమ సంస్కారాలను నిర్వహించనున్నట్లు ఆమె కుమారుడు, నటుడు నరేష్ తెలిపారు. అభిమానుల సందర్శనార్ధం ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంచి అంత్యక్రియలు నిర్వహిస్తారని భావించినప్పటికీ, ఫిల్మ్ ఛాంబర్‌కు తీసుకుని రాకుండా డైరెక్ట్‌గా విజయకృష్ణ గార్డెన్స్‌కే తీసుకుని వెళ్లి అంత్యక్రియలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
1946 ఫిబ్రవరి 20 తమిళనాడులో జన్మించారు విజయ నిర్మల. 11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో తెలుగు సినిమా ఆరంగ్రేటం చేశారు. 44 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆమె అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డ్‌కు ఎక్కారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.