మొక్కల ఉత్పత్తిలో కడియం నర్సరీ రైతుల కృషి భేష్..

19

పర్యావరణ హితమైన పచ్చని మొక్కల ఉత్పత్తిలో కడియం నర్సరీ రైతుల కృషి భేష్ అని వైసీపీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్,ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.మంగళవారం ఆయన కడియపులంక సత్యదేవా నర్సరీని సందర్శించి కొన్ని రకాల మొక్కలు కొనుగోలు చేశారు.కడియం నర్సరీమేన్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పుల్లా అబ్బులు,ఆయన కుమారులు వీరబాబు,రాజశేఖర్ లు విజయసాయిరెడ్డికి ఘన స్వాగతం పలికారు.

దేశంలోనే అతిపెద్ద నర్సరీ పరిశ్రమ కడియంలో ఉండడం మన రాష్ట్రానికి గర్వకారణం అని విజయసాయి రెడ్డి అన్నారు. దేశ,విదేశీ జాతి మొక్కలు ఇక్కడ లభిస్తున్నాయని తెలుసుకొని వచ్చానని పేర్కొన్నారు. నర్సరీలో ఫల,పుష్ప రకాల మొక్కలను విజయసాయిరెడ్డి తీరిగ్గా తిలకించారు. అనంతరం సత్యదేవా నర్సరీ ఏర్పాటు చేసిన ఫ్రూట్ స్టాల్‌ను పరిశీలించి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు

.కివి,డ్రెగాన్ ఫ్రూట్,రామ,లక్ష్మణ, హనుమంత ,గోల్డెన్ సీతా ఫలాలు,అనాస,ద్రాక్ష, జామ,దానిమ్మ,మామిడి వంటి గ్రాఫ్టింగ్ జాతి రకాల ఫలాలు ఈ ప్రదర్శనలో ఉన్నాయి. వాటిని చూసి ఆజాతి రకాల మొక్కలను కూడా విజయసాయిరెడ్డి ఆర్డర్ చేశారు. అలానే ఫల జాతి మొక్కలపై సత్యదేవా నర్సరీ యాజమాన్యం వేసిన పుస్తకాన్ని విజయసాయి రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించారు. కాకినాడ ఎంపీ వంగా గీత,రావులపాలెం ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి,మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామి నాయుడు, ఎంపీ విజయసాయిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు శాలువాతో సత్కరించారు.