హీరోయిన్ కృతిశెట్టితో తాను సినిమా చేయలేనని తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి అన్నారు. కృతిశెట్టి-వైష్ణవ్ తేజ్ జంటగా నటించిన ‘ఉప్పెన’ చిత్రంలో విజయ్ సేతుపతి ఆమె తండ్రి పాత్రలో కనిపించారు. ఆ సినిమాలో విజయ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించారు. కాగా, తాజాగా ‘లాభం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. తాను కథానాయకుడిగా చేయనున్న ఓ సినిమాలో కృతిశెట్టిని హీరోయిన్‌గా ఎంపిక చేశారని అన్నారు.
ఉప్పెన సినిమాలో తండ్రిగా నటించి,ఇప్పుడు ఆమెతో రొమాన్స్ చేయడం చాలా కష్టం అని ఆమెని రిజెక్ట్ చేశానని చెప్పుకొచ్చాడు విజయ్ సేతుపతి. సినిమా యూనిట్ సభ్యులకు నేను ఉప్పెన సినిమాలో కృతి శెట్టికి తండ్రిగా నటించిన విషయం తెలియదు. అందుకే ఆమెను నా సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేశారు. కాని నేను చేయను అని చెప్పేశా. నాకు కృతి వయస్సు ఉన్న కొడుకు ఉన్నాడు. అందుకే ఆమెతో కలిసి నటించలేను అని టీమ్‌కు చెప్పాను అన్నాడు విజయ్. కూతురిలా భావించిన అమ్మాయితో ఎలా రొమాన్స్ చేస్తాను చెప్పండి అంటూ యూనిట్ సభ్యులకు చెప్పాడట. ఎప్పటికీ తనతో హీరోగా చేయనని విజయ్ చెప్పుకొచ్చాడు.
ఇక, ‘లాభం’ సినిమా విషయానికి వస్తే.. వ్యవసాయం, దళారీ వ్యవస్థ, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలియజేసే విధంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో విజయ్ రైతు సమస్యలపై పోరాడే వ్యక్తిగా కనిపిస్తారు. ఈ చిత్రం సెప్టెంబర్ 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతికి జోడీగా అందాల భామ శృతిహాసన్ నటిస్తుంది. జగపతిబాబు విలన్ పాత్రలో నటిస్తుండగా, సాయి ధన్సిక ఓ కీలకమైన కీలక పాత్ర పోషించింది. ఎస్‌పీ జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ(వైజాగ్ సతీష్) నిర్మించారు. ఇమాన్ సంగీతం అందించారు.