కేఫ్ కాఫీడే వ్యవస్థాపకుడు, కర్నాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. నేత్రావతి నదిలో ఆయన మృతదేహం లభ్యం కాగా పలువురు ప్రముఖులు సిద్ధార్థ మృతిపై స్పందించారు. తాజాగా సిద్ధార్థ మృతిపై లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా స్పందించారు. తనది కూడా సిద్ధార్థ పరిస్థితేనంటూ ట్విటర్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
సిద్ధార్ధ తనను ఐటీ అధికారులు వేధిస్తున్నారని రాసిన లేఖను చూసి తాను దిగ్భ్రాంతికి లోనయ్యాయన్నారు. నిస్సాహాయుల పట్ల బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు ఇలాగే వ్యవహరిస్తున్నారన్నారు. రుణాలను పూర్తిగా చెల్లిస్తానని తాను ముందుకొచ్చినా వేధిస్తున్నారంటూ ట్వీట్ చేశారు.
పాశ్చాత్య దేశాల్లో ప్రభుత్వాలు, బ్యాంకులు రుణ గ్రహీతలకు అప్పు చెల్లించడంలో సాయం చేస్తాయి. కానీ నా విషయంలో మాత్రం, ఓ వైపు నా ఆస్తులను జప్తు చేసేందుకు పోటీపడుతూనే మరోవైపు నేను అప్పు చెల్లించేందుకు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇదిఇలా ఉండగా భారత బ్యాంకులకు రూ.9 వేల కోట్ల మేర రుణాలు ఎగవేసిన కేసులో విజయ్ మాల్యాపై ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.