న్యూఢిల్లీలోని జాతీయ సంగ్రహాలయంలో ఏర్పాటు చేసిన నిజాం ఆభరణాల ప్రదర్శనను ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు తిలకించారు. ఇందులో ఏర్పాటు చేసిన జాకబ్ డైమండ్ సహా… 173 రకాల ఆభరణాలను ఆయన ఆసక్తిగా తిలకించారు. భారతీయ ముఖ్యంగా హైదరాబాద్ వృత్తికళాకారుల నైపుణ్యానికి, పనితనానికి ఈ ప్రదర్శన నిదర్శనంగా నిలిచిందని ఆయన కితాబిచ్చారు. అదే విధంగా జాతీయ సంగ్రహాలయంలో ప్రదర్శనకు ఉంచిన కళాఖండాలు భారతీయ గత వైభవాన్ని కళ్ళకు కడతాయని, ఇది ప్రతి ఒక్కరూ చూడదగిన ప్రదర్శన అని తెలిపారు. ఈ సందర్భంగా సంగ్రహాలయ డైరక్టర్ జనరల్ శ్రీ బి.ఆర్.మణి మరియు క్యూరేటర్లు, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు ఈ ప్రత్యేక ప్రదర్శన నిర్వాహకులకు ఉపరాష్ట్రపతి అభినందనలు తెలిపారు. సంగ్రహాలయ సందర్శకుల పుస్తకంలోనూ మరియు సామాజిక మాధ్యమాల్లో ఉపరాష్ట్రపతి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
సామాజిక మాధ్యమాల్లో ఉపరాష్ట్రపతి పంచుకున్న విశేషాలు….
న్యూఢిల్లీలోని జాతీయ సంగ్రహాలయంలో “జ్యూవెల్స్ ఆఫ్ ఇండియా – ది నిజామ్స్ జ్యూవెలరీ కలెక్షన్” పేరిట ఏర్పాటు చేసిన ఆభరణాల ప్రదర్శనను తిలకించడం ఆనందదాయకం. నైజాం రాజుల ఆభరణాలకు సంబంధించిన అతిపెద్ద ప్రదర్శనగా దీన్ని చెప్పుకోవాలి. ఉన్నతమైన భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.
భారతీయ వృత్తి కళాకారుల నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచే ఈ ఆభరణాల మీద ఉన్న క్లిష్టమైన నగిషీలు, హైదరాబాద్ స్వర్ణకారులు నైపుణ్యానికి తార్కాణంగా నిలిచాయి. జాకబ్ వజ్రంతో పాటు 172 రకాల మిరుమిట్లు గొలిపే నగలు ఈ ప్రదర్శనలో ఉన్నాయి. గోల్కొండ వజ్రాలు, కొలంబియా పచ్చలు పొదిగిన ఆభరణాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ఇటువంటి నగలు భారతీయ సంప్రదాయ వృత్తి కళాకారులు నైపుణ్యానికి అద్దం పడతాయి. వారి ప్రతిభను ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతదేశం, ఆయా ప్రాంతాల సంప్రదాయ మరియు నైపుణ్యానికి సంబంధించిన ఆభరణాలకు సైతం ప్రసిద్ధి చెందింది.
వీటిని సంరక్షించి, ఆయా కళాకారుల నైపుణ్యాన్ని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
భారతీయ ఆభరణాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. దేశంలోని అన్ని ప్రాంతాల కళాకారుల నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచే ఆభరణాల ఎగుమతుల విషయంలో మన ప్రయత్నాలు మరింత విస్తృతం కావాలసిన అవసరం ఉంది. ఈ అద్భుతమైన నగలను సంరక్షించి, ప్రజలకు వాటి గొప్పతనాన్ని తెలియజేసే విధంగా ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్న జాతీయ సంగ్రహాలయానికి మరియు భారతీయ రిజర్వు బ్యాంకుకు అభినందనలు తెలియజేస్తున్నాను.
జాతీయ సంగ్రహాలయంలో ప్రదర్శనకు ఉంచిన ఈ వస్తువులన్నీ చరిత్రను అభిమానించే వారికి, కళాప్రేమికులకు గొప్ప అవకాశమనే చెప్పాలి. భారతదేశ గతవైభవాన్ని ఇవి కళ్ళకు కడతాయి. ఈ సంగ్రహాలయం దేశ విదేశాలకు చెందిన 2 లక్షలకు పైగా అరుదైన వస్తువులకు నిలయంగా భాసిల్లుతోంది. భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే పురాతన కళాఖండాలు ఇందులో భద్రపరచడం ఆనందదాయకం. ఈ ప్రదర్శనం అందరూ వీక్షించదగినది.ఈ సంగ్రహాలయ డైరక్టర్ జనరల్ శ్రీ బి.ఆర్.మణి మరియు క్యూరేటర్లు, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు ఈ ప్రత్యేక ప్రదర్శన నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తున్నాను.