రాజకీయంగా పెరిగింది, ఎదిగింది, ఒదిగింది, తెలంగాణలోనే అన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. తెలంగాణ ప్రభుత్వం తనకు పౌరసన్మానం చేయడం గొప్పగా ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున రాజ్‌భవన్‌లో వెంకయ్యకు పౌరసన్మానం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకయ్య రాష్ట్ర గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు .
హైదరాబాద్ తో తనకెంతో సంబంధం ఉందని, హైదరాబాద్ లో రాజకీయంగా ఎదిగానని చెప్పడానికి ఎంతో గర్వపడుతున్నానని చెప్పారు. అంతేకాకుండా హైదరాబాద్ ను ఒక మినీ భారత్ అనడంలో అతిశయోక్తి లేదన్నారు వెంకయ్య. ప్రపంచ పటంలో హైదరాబాద్ కు ప్రత్యేక స్థానం ఉందని, హైదరాబాద్ అంటే ఉత్తరాది వాళ్లకి దక్షిణాది.. దక్షిణాది వాళ్లకి ఉత్తరాది అని తెలిపారు వెంకయ్య.
హైదరాబాద్ బిర్యానీ, హలీంకు ప్రత్యేకత ఉందన్నారు. తాను మంచి భోజనప్రియుడిని.. భాషా ప్రియుడిని అని పేర్కొన్నారు. తెలంగాణలో తాను పర్యటించని ప్రాంతం లేదు. అన్ని తాలుకాలు తిరిగానని, హైదరాబాద్ అన్న.. తెలంగాణ అన్న తనకెంతో ఇష్టమని తెలిపారు. అంతేకాకుండా కన్నతల్లిని, మాతృభాషను, మాతృదేశాన్ని పట్టించుకోని వాడు మనిషే కాదని, ఆంగ్లానికి తాను వ్యతిరేకం కాదు అంటూనే ఆయన తెలుగు భాషాభిమానిని అని తెలిపారు. ఇక ‘తెలుగుభాషలో గ్రామరే కాదు.. గ్లామర్ కూడా ఉంది. అంటువ్యాధిలా మారిన ఇంగ్లీష్‌ను వదిలించే బాధ్యతను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకోవాలి’ అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వెంకయ్యనాయుడు.