వినాయకచవితి సందర్భంగా విడుదలవుతున్న ‘అర్జున్ రెడ్డి’ సినిమాపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. ఈ సినిమాలో అసభ్యకరమైన సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఈరోజు ఆయన హైదరాబాదులోని సెన్సార్ బోర్డ్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. యువత పెడదారి పట్టేలా ఈ సినిమా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోస్టర్లను చించినందుకు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనపై వేసిన సెటైర్లపై వీహెచ్ ఫైరయ్యారు. లిప్ లాక్ పోస్టలర్లను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. లిప్ లాక్ పోస్టర్లను సమర్థిస్తూ హీరో విజయ్ దేవరకొండ ట్వీట్ చేయడంపై మండిపడిన వీహెచ్.. తనపై సెటైర్లు వేసిన రాంగోపాల్ వర్మకు తగిన బుద్ధి చెబుతానని అన్నారు.
బస్సుపై అతికించిన అర్జున్ రెడ్డి ‘లిప్ లాక్’ పోస్టర్‌ను వీహెచ్ చించేయడాన్ని వ్యతిరేకిస్తూ రాంగోపాల్ వర్మ మంగళవారం వరసపెట్టి ఫేస్‌బుక్‌లో వివాదాస్పద పోస్టులు చేశారు. ‘హనుమంతరావు బట్టలు చించేయాలని విజయ్ దేవరకొండను కోరుతున్నా. కానీ హనుమంతరావును చిన్నపిల్లలు అలా చూసి తట్టుకోగలరా అని భయమేస్తోంది’ అని ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్జీవీపై వీహెచ్ ఫైరయ్యారు.