శుక్రవారం కూడా ఢిల్లీ తీవ్రమైన వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గాలి నాణ్యత మరింత దిగజారగా, దట్టమైన పొగమంచు ప్రయాణికుల సమస్యలను పెంచింది. ముఖ్యంగా విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 6 గంటలకు ఢిల్లీలో మొత్తం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 387గా నమోదై, ‘వెరీ పూర్ (అత్యంత దయనీయ స్థాయి)’లోనే కొనసాగింది. గురువారం ఉదయం 356గా ఉన్న AQIతో పోలిస్తే పరిస్థితి మరింత క్షీణించినట్లు స్పష్టమవుతోంది.
ఐటీఓ ప్రాంతం సహా నగరంలోని పలు ప్రాంతాల్లో రహదారులు, భవనాలను కమ్మేసిన విషపూరిత పొగమంచు కారణంగా దృశ్యమానత తీవ్రంగా తగ్గింది. దీనికి తోడు దట్టమైన పొగమంచు కారణంగా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI)లో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయం ‘ఎక్స్’ (X) వేదికగా ప్రయాణికులకు సూచనలు జారీ చేసింది.ప్రస్తుతం కొనసాగుతున్న దట్టమైన పొగమంచు కారణంగా CAT-III పరిస్థితుల్లో విమాన సేవలు నిర్వహిస్తున్నాము. దీని వల్ల షెడ్యూల్‌లలో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రయాణికులకు అవసరమైన సహాయం అందించేందుకు మా సిబ్బంది అన్ని భాగస్వాములతో సమన్వయంతో పని చేస్తున్నారు. తాజా విమాన సమాచారానికి మీ సంబంధిత ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించండి. కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలియజేస్తూ, మీ సహకారానికి ధన్యవాదాలు అని పేర్కొంది.
ఢిల్లీ నగరంలోని పలు ప్రాంతాల్లో AQI ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఆర్‌కే పురం అత్యధికంగా 447 AQIతో అత్యంత కాలుష్య ప్రాంతంగా నిలిచింది. అనంతరం ఆనంద్ విహార్, వివేక్ విహార్, సిరిఫోర్ట్ ప్రాంతాల్లో 442 AQI నమోదైంది. ఇతర కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో ద్వారక సెక్టార్-8 (429), నెహ్రూ నగర్ (425), ఎన్ఎస్ఐటీ ద్వారక (423), డాక్టర్ కర్ణీ సింగ్ షూటింగ్ రేంజ్ (423), ఒక్లా ఫేజ్-2 (422) ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM) ఢిల్లీ-ఎన్‌సీఆర్ అంతటా GRAP స్టేజ్-IV చర్యలను అమలు చేసింది.
Also Read:TTD:29 నుండి తెప్పోత్సవాలు

