ప్రముఖ టాలీవుడ్ హాస్య నటుడు వేణు మాధవ్ మృతి తెలుగు సినీ వర్గాలను విషాదంలో ముంచింది. కాలేయ సంబంధిత వ్యాధితో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం 12.20గంటలకు ఆయన కన్నుమూశారు.మౌలాలిలో గురువారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. వేణు మాధవ్ మౌలాలిలో ఉంటున్నారు. ఆ ప్రాంతంతో ఆయనకు సుదీర్ఘ అనుబంధం ఉంది.ప్రస్తుతం వేణు కుటుంబం కూడా అదే ప్రాంతంలో ఉంటుండటంతో ఆయన అంత్యక్రియలు అక్కడే నిర్వహించనున్నారు.
అంతకుముందు అభిమానుల సందర్శనార్థం వేణుమాధవ్ భౌతికాయాన్ని ఫిల్మ్ ఛాంబర్‌లో అందుబాటులో ఉంచారు. అనంతరం మౌలాలీలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పేదవారికి ఆయన ఎంతో సహాయం చేసేవాడని, అటువంటి వ్యక్తి తమ మధ్య లేకపోవడం దురదృష్టకరమని పలువులు అన్నారు. వేణుమాధవ్ ఇప్పటివరకు 600 సినిమాల్లో నటించారు. తొలిప్రేమ, దిల్, లక్ష్మి, సై, ఛత్రపతి చిత్రాలు మంచిపేరు తీసుకొచ్చాయి. 2006లో లక్ష్మి సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారాన్ని కూడా వేణుమాధవ్ అందుకున్నారు.