13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. వెంకయ్యనాయుడి చేత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయించారు. . ఈ సందర్భంగా వెంకయ్య హిందీలో ప్రమాణం స్వీకారం చేశారు. ఉపరాష్ట్రపతి పదవి చేపట్టినందున ఆయన రాజ్యసభ చైర్మన్‌గా కూడా కొనసాగుతారు.
రాజకీయ నాయకుడిగా నిత్యమూ రాజకీయ ప్రసంగాలు చేసేందుకు అలవాటు పడిపోయిన వెంకయ్య.. ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వెంకయ్యనాయుడు మైకు ముందుకు వచ్చి, తాను ప్రసంగించాలా? అని అక్కడున్న అధికారులను అడగడంతో, వారు వద్దని చెప్పడంతో, తనకు కేటాయించిన సీట్లో కూర్చునేందుకు ఆయన వెళ్లిపోయారు. అయితే, ప్రొటోకాల్ ప్రకారం ప్రమాణ స్వీకారాల తరువాత రాష్ట్రపతి ఆశీనులై ఉండగా, ప్రసంగాలకు అవకాశం లేదు.
రాష్ట్రపతి దర్బార్‌హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ, ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ సీనియర్ లీడర్ ఎల్‌కే అద్వానీ, అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, ఎన్టీయే ఎంపీలు, టీఆర్‌ఎస్ తరఫున ఎంపీలు జితేందర్‌రెడ్డి, కవిత తదితరులు హాజరయ్యారు.