రాష్ట్రపతి ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు అధికార, విపక్షాలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. విపక్షాల తరపున యశ్వంత్ సిన్హా బరిలో ఉంటారని ప్రచారం జరుగుతుండగా తాజాగా అధికార పార్టీ తరపున ఉపరాష్ట్రపతి వెంకయ్య పేరు రాష్ట్రపతి రేసులో వినిపిస్తోంది.
ఈ మేరకు వెంకయ్య నాయుడి నివాసంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముందు ఆ పార్టీ కీలక నేతలు వెంకయ్యనాయుడితో భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది.
పార్టీలకు అతీతంగా వెంకయ్యనాయుడికి అభిమానులు ఉన్నారు. వాస్తవానికి రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి సొంతంగా 48 శాతం ఓట్ షేర్ ఉంది. ఒకట్రెండు పార్టీల మద్దతుతో ఈజీగా ఎన్నికల్లో నెగ్గగలదు. ఇక విపక్షాలు సైతం బీజేపీకి దీటైన వ్యక్తిని బరిలో దింపేందుకు కసరత్తు చేస్తున్నాయి.