డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డ్రగ్స్ కేసులో విచారణ కోసం బుధవారం ఎక్సైజ్ కార్యాలయంలో సిట్ ఎదుట హాజరయ్యారు. తన కుమారుడు, సోదరుడు, న్యాయవాదులతో కలిసి ఆయన అబ్కారీ కార్యాలయానికి వచ్చారు. ఎక్సైజ్ శాఖలోని సెక‍్షన్ 67 ప్రకారం ఆయనను సిట్ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై మెగా హీరో వరుణ్ తేజ్ స్పందించాడు.
డ్రగ్స్ వ్యవహరంలో నోటీసులు అందుకున్నవారంతా సిట్ విచారణకు హాజరు కావాల్సిందేనని మెగా హీరో వరుణ్ తేజ్ అన్నాడు. చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందని చెప్పారు. ఈ వ్యవహారంలో నోటీసులు అందుకున్నవారంతా ఇప్పటికే మీడియా ద్వారా తమ స్పందనను తెలియజేశారని తెలిపాడు. డ్రగ్స్ తీసుకోవడం మంచిది కాదని మెరుగైన ఆరోగ్యం కంటే ఏదీ గొప్పది కాదని అన్నాడు.
వరుణ్ తేజ్ పూరీ జగన్నాథ్ గురించి మాట్లాడుతూ.. ఆయన చాలా మంచి వ్యక్తి అని కితాబిచ్చాడు. ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారని పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉంటారని చెప్పాడు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడే స్వభావం కూడా ఆయనకు లేదని అన్నాడు. పక్కవాళ్లను జగన్ చాలా మంచిగా చూసుకుంటాడని ఆయన ఏం ఆహారం తీసుకుంటే, వాళ్లింట్లోని బాయ్ కు కూడా అదే ఫుడ్ పెడతారని చెప్పాడు. ఆయన పేరు డ్రగ్స్ వ్యవహారంలో బయటకు రావడంతో తాను షాక్ కు గురయ్యానని తెలిపాడు.