జక్కన్న,నాగ్‌లపై ఒట్టేసి చెబుతున్నా…

262
- Advertisement -

‘ఈమధ్య రాజమౌళిని కలిసి ‘వంగవీటి’ నాకు ప్రత్యేకమైన చిత్రమని చెప్పా. ‘ఇలాంటివి చాలా చూశాంలే’ అన్నట్టు ఓ ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చాడు. దానికి నేను అర్హుడినే. ఎందుకంటే అలాంటి మాటలు చాలాసార్లు చెప్పుంటా. కానీ ఇక మీదట గర్వపడే సినిమాలే చేస్తా. నా మీదొట్టు. నాకంటే మిన్నగా ప్రేమించే నాగార్జున మీదొట్టు’’ అన్నారు రాంగోపాల్‌ వర్మ. శివ టు వంగవీటి:ద జర్నీ ఆఫ్ ఆర్జీవీ స్పెషల్ ఈవెంట్‌లో మాట్లాడిన వర్మ…

‘‘ట్విట్టర్‌లో ఆమధ్య ఒకరు కామెంట్‌ పెట్టారు. ‘ఎన్నిసార్లు కొట్టినా చావని పాము నువ్వు’ అని. ‘వర్మ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది’ అని ఓ ఇంటర్వ్యూలో నాగార్జునని ఓసారి అడిగితే… ‘పిచ్చి’ అన్నాడు. ఆ మాటలకు నేను అర్హుడినే. విజయవాడ ఇంజనీరింగ్‌ కాలేజీలో చదువుతున్నప్పుడే అక్కడి రాజకీయాలు, పరిస్థితి, వంగవీటి కథపై అవగాహన ఉన్నాయి. అయితే సినిమా తీయాలని ఎప్పుడూ అనుకోలేదు. ‘వంగవీటి’ కథని సినిమాగా తీసే పరిపక్వత ఇప్పటికి వచ్చిందేమో. ‘బ్రేక్‌’ అనే మాట నేను నమ్మను. కాకపోతే ప్రపంచంలో ఏ దర్శకుడికీ తన తొలి సినిమాకి నాగార్జున లాంటి నిర్మాత దొరకడు. ‘కావాలంటే నా పారితోషికం తగ్గించండి… కానీ రామూకి ఏం కావాలో అది ఇవ్వండి’ అంటూ నా ప్రతి నిర్ణయాన్నీ గౌరవించారని తెలిపారు.

Varma Speech @ Shiva To Vangaveet

వెంకటేష్‌ మాట్లాడుతూ ‘‘శివ’ తరవాత ‘శివ’లాంటి సినిమానో, దానికంటే గొప్ప సినిమానో తీస్తాడనుకొన్నా. కానీ అంచనాలకు భిన్నంగా ‘క్షణం క్షణం’ చేశాడు. నాగ్‌తో చైన్‌ లాగించాడు. నన్ను కూర్చోబెట్టి పాట పాడించాడు. ‘ఈ సినిమాలో శ్రీదేవితోనే ఎక్కువ సీన్లు ఉన్నాయని ఫీలౌతున్నావా’ అని ఓసారి అడిగాడు. ‘నాకు ఈ కథ నచ్చింది’ అని తనతో చెప్పేవాణ్ని. మేమంతా ‘శివ’ గురించి మాట్లాడుకొనేవాళ్లం. మేం ఎన్ని ఫైట్లు చేసినా వర్కవుట్‌ అవ్వలేదు. ‘చైను పట్టుకొని నాగ్‌ క్రెడిట్‌ అంతా కొట్టేశాడు’ అని చెప్పుకొనేవాళ్లమ’’న్నారు.

‘‘వందలమంది దర్శకులకు స్ఫూర్తి వర్మ. అయితే మధ్య మధ్యలో ‘ఐస్‌ క్రీమ్‌’, ‘అడవి’ అంటూ ఏవేవో తీస్తుంటారు. చాలా ఏళ్ల తరవాత ఆయన ‘వంగవీటి’ కోసం ప్రచారం చేస్తున్న విధానం చూస్తుంటే ఈ సినిమాని కచ్చితంగా ప్రేమించి తీశారన్న నమ్మకం కలుగుతోంది. ‘వంగవీటి’తో వర్మ మళ్లీ మన మధ్యకు వచ్చేశారనిపిస్తోంద’’న్నారు రాజమౌళి. ఇంకా ఈ కార్యక్రమంలో బి.గోపాల్‌, బోయపాటి శ్రీను, రేవంత్‌రెడ్డి, టి.సుబ్బిరామిరెడ్డి, రాజశేఖర్‌, ఎస్‌.గోపాల్‌రెడ్డి, పూరి జగన్నాథ్‌, సుధీర్‌బాబు, తనికెళ్ల భరణి, హరీష్‌ శంకర్‌, వైవీఎస్‌ చౌదరి, వంశీపైడిపల్లి, సి.కల్యాణ్‌, రాజశేఖర్‌, జీవిత, రామసత్యనారాయణలతో పాటు ‘వంగవీటి’ చిత్ర బృందం పాల్గొంది.

- Advertisement -