హైదరాబాద్‌లో దోమలగూడలోని పింగళి వెంకటరామిరెడ్డి హాలులో ఏర్పాటు చేసిన రంగారెడ్డి – హైదరాబాద్ – మహబూబ్‌నగర్ పట్టభద్రుల టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభీ వాణిదేవీతో ఆదివారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బ్రాహ్మణుల సమన్వయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఇంతమంది బ్రాహ్మణులను ఒకే వేదికపై చూస్తుంటే జ్ఞాన సరస్వతిని చూస్తున్నట్టు ఉంది అని కేటీఆర్ అన్నారు. వాక్ శుద్ధి, చిత్తశుద్ధి ఉన్న నాయకులు సీఎం కేసీఆర్ అని తెలిపారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కేసీఆర్ బ్రాహ్మణుల కోసం సిద్దిపేటలో ప్రత్యేకంగా బ్రాహ్మణ సదన్ ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాలకు పుణ్యక్షేత్రాల పేర్లు పెట్టిన ధార్మికుడు సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్ మాటలకే పరిమితం కాలేదు.. అనుక్షణం రాష్ర్ట అభివృద్ధిని కాంక్షించారు. బ్రాహ్మణ పరిషత్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. 6 వేల మంది అర్చకులకు ప్రభుత్వ ట్రెజరీ ద్వారా జీతాలు అందిస్తున్నాం. ఓవర్సీస్ పథకం ద్వారా పేద బ్రాహ్మణ విద్యార్థులను విదేశాల్లో చదువుకునేందుకు ప్రోత్సహిస్తున్నాం. ఇప్పటికే ఈ పథకం ద్వారా 386 మంది విద్యార్థులకు లబ్ది చేకూరిందన్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణిదేవీ గెలుపు ఖాయమైందని మంత్రి కేటీఆర్ అన్నారు. గెలుపు ఖాయమైనప్పటికీ వాణిదేవీని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. వాణిదేవి నిగర్వి, నిరాడంబురాలు, గొప్ప విద్యావేత్త అని తెలిపారు. వాణిదేవీ తన విద్యాసంస్థల నుంచి లక్ష మంది పట్టభద్రులను తయారు చేసిందని గుర్తు చేశారు. వాణిదేవిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పట్టభద్రులకు చేసిందేమీ లేదు అని మంత్రి కేటీఆర్ అన్నారు. తనది ప్రశ్నించే గొంతు అని రాంచందర్‌రావు ప్రగల్భాలు పలకడమే తప్ప.. తెలంగాణకు నష్టం చేస్తున్న కేంద్రాన్ని ప్రశ్నించిన దాఖలాలు లేవన్నారు మంత్రి కేటీఆర్.