హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్‌రావును టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్.వాణీదేవి మట్టికరిపించారు. ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్.వాణీదేవి ఘన విజయం సాధించారు. వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓట్లు 1,12,689 పోలవ్వగా రెండో ప్రాధాన్యతగా 36,580 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 1,49,269 ఓట్లతో వాణీదేవి విజయం సాధించారు.
కాగా తెలంగాణలో ఈ నెల 14న రెండు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత మూడు రోజులుగా ఓట్ల లెక్కింపు జరుగుతుండగా ఈరోజు, మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఫలితం వెలువడింది. ఇక నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఫలితం తేలాల్సి ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు దిశగా పయనిస్తుండగా, తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో కొనసాగుతున్నారు.