తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్..

237
ts
- Advertisement -

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లోనే శాసనసభలో ప్రకటన చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యోగులకు ఏపీలో ఇచ్చిన ఐఆర్ కంటే 2 శాతం ఎక్కువే ఇస్తానని ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు తెలంగాణ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన రీతిలో పీఆర్సీ ని 29 శాతం నుంచి 30 శాతం వరకు ప్రకటిస్తోందని తెలుస్తోంది. అయితే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థికమంత్రి హరీష్‌రావు చేసిన ప్రసంగంలో పీఆర్సీ విషయాన్ని ప్రస్తావించకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు నిరాశ చెందారని కొన్ని ప్రభుత్వ వ్యతిరేక పత్రికలు అసత్యకథనాలు వండివార్చాయి. ఫిట్‌మెంట్‌ను దాదాపు 30 శాతానికి పెంచితే రూ.9 వేల కోట్లు అదనంగా అవసరమవుతాయని ఆర్థిక శాఖ లెక్కలేసింది. సీఎం కేసీఆర్​ కూడా దీనిపై ప్రకటన చేయడంతో బడ్జెట్‌లో పీఆర్సీ గురించి వివరిస్తారని ఉద్యోగులు భావించారు. కానీ ఈ బడ్జెట్‌లో సర్కారు పీఆర్సీ ఊసే ఎత్తకపోవడంతో ఉద్యోగ వర్గాలు నిరుత్సాహానికి గురయ్యాయని కొన్ని పత్రికలు రాసుకొచ్చాయి.

అయితే బడ్జెట్‌లో ఆర్థిక శాఖకు చేసిన కేటాయింపుల్లో రూ. 8 వేల కోట్లను ప్రత్యేకంగా చూపారు. 2021-22 వార్షిక బడ్జెట్‌లో భాగంగా ఆర్థిక, ప్రణాళిక శాఖకు బడ్జెట్లో రూ. 45,923 కోట్లను నిర్దేశించారు. అందులో రూ. 8 వేల కోట్లను మాత్రం నిర్వహణ పద్దు కింద చూపారు. అయితే ఈ నిధులను పీఆర్సీ కేసమే కేటాయిస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది. పీఆర్సీపై సీఎం కేసీఆర్ ప్రకటన అనంతరం ఆ నిధులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచితే మరో రూ.3 వేల కోట్ల వరకు ఆయా ఉద్యోగులకు అందించే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించడం వాయిదా పడుతుంది. ఆ మొత్తాన్ని పీఆర్సీ కోసం వినియోగించే అవకాశం ఉంది. మొత్తంగా పీఆర్సీపై మరికొద్ది రోజుల్లోనే సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పడం ఖాయమని చర్చ జరుగుతోంది.

- Advertisement -