ఇటీవల తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు అధికార పార్టీ టీఆర్‌ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఒట్ల లెక్కింపులో భాగంగా తాజాగా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తొలి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. ఏడు రౌండ్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ఆధిక్యంలో ఉన్నారు. సమీప రామచందర్‌రావుపై 8,021 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఏడు రౌండ్లలో కలిపి టీఆర్‌ఎస్ అభ్యర్థి వాణీదేవికి 1,12,689 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుకు 1,04,668 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావుకు 53,610 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 31,554 ఓట్లు, టీడీపీ అభ్యర్థి ఎల్ రమణకు 5,973 ఓట్లు పోలయ్యాయి. ఏడు రౌండ్లలో 21,309 ఓట్లు చెల్లలేదు. ప్రస్తుతం తొలి ప్రాధాన్యం ఓట్లలో ఎవరికీ మెజారిటీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు.